America Elections | న్యూఢిల్లీ, అక్టోబర్ 25: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపరులు అగ్రరాజ్యంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికానే పెద్దన్న. అందుకే ఆ దేశాధినేతగా ఎవరొచ్చినా వారు తీసుకొనే నిర్ణయాల ప్రభావం మిగతా దేశాలపైనా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే భారత్‌పై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా దేశీయ ఐటీ రంగం కుదేలవుతుందన్న అంచనాలు ఇప్పుడు వినిపిస్తుండటం గమనార్హం. ఫిలిప్‌క్యాపిటల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఇలాగే ఉన్నది మరి.
అయితే ట్రంప్ అధికారంలోకి వస్తే ఏర్పడే సవాళ్లను అధిగమించడానికి భారతీయ ఐటీ కంపెనీలకు కొన్ని మార్గాలున్నాయనీ ఈ రిపోర్టు పేర్కొన్నది. అక్కడి మార్కెట్లలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం, డెలివరీ సెంటర్లు తెరవడం, సబ్కాంట్రాక్టర్లను పెట్టుకోవడం వంటివి కలిసి రావచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ట్రంప్‌కు పోటీగా భారతీయ మూలాలున్న, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్తి కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డారు. ప్రస్తుత బైడెన్ ప్రభుత్వంలో హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నది తెలిసిందే. అయినప్పటికీ ట్రంప్‌కే ఎక్కువమంది ఓటర్లు మొగ్గుచూపుతున్నారన్న అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫిలిప్‌క్యాపిటల్ నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
అమెరికాలో ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే.. భారతీయ రక్షణ, ఎనర్జీ, కమోడిటీస్ రంగాలకు లాభమేనని కూడా ఫిలిప్‌క్యాపిటల్ రిపోర్టు చెప్తున్నది. అమెరికాలో శిలాజ ఇంధన ఉత్పత్తి పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, సహజ వాయువు ధరలు పడిపోవచ్చని, దీంతో వీటినే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో పెట్రో ధరలు దిగిరావచ్చని చెప్తున్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుతాయని, ఫారెక్స్ రిజర్వులకూ బలం చేకూరుతుందన్న అభిప్రాయాలున్నాయి.
ఇక ట్రంప్ హయాంలో ఈవీ ప్రోత్సాహకాలు ఉండకపోవచ్చని, ఇది భారత్ నుంచి అక్కడికి ఎగుమతి అవుతున్న ఈవీ విడిభాగాలకు ప్రతికూలమని అంటున్నారు. అయితే గతంలో మాదిరే చైనాపట్ల అధిక సుంకాలను ట్రంప్ తీసుకొచ్చే వీలుందని, ఇది భారత్‌కు కలిసిరాగలదన్న వాదనలున్నాయి. రక్షణ, కమోడిటీస్, టెక్స్టైల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగాల ఎగుమతులకూ డిమాండ్ పెరగవచ్చని తాజా రిపోర్టు అంచనా వేసింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగబోతున్నాయి.
గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్.. అప్పట్లోనే వీసా పాలసీలు, వలస విధానాలపై కఠిన వైఖరిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ ట్రంపే గెలిస్తే.. అవే పరిస్థితులు నెలకొనవచ్చన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వర్క్ వీసా నిబంధనలు ఇంకా కఠినం కావచ్చని, ఇది భారతీయ ఐటీ కంపెనీలకు శరాఘాతంలా పరిణమించవచ్చని ఫిలిప్‌క్యాపిటల్ చెప్తున్నది. భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా తదితర దేశాల ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఆధారపడి ఆర్జిస్తున్న సంగతి విదితమే. అక్కడికి భారతీయ ఉద్యోగులను పంపించి పని చేయిస్తున్నాయి.
కానీ ఇప్పుడున్న బైడెన్‌కు ముందు ట్రంప్ కనబర్చిన వైఖరితో దేశ ఐటీ రంగం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ వీసాలు రాకుండా అడ్డుకున్నారు. ఫలితంగా అమెరికన్లకు అన్నిరకాల నైపుణ్యాలను పెద్ద ఎత్తున ఖర్చుపెట్టిమరీ నేర్పించుకోవాల్సి వచ్చింది. అంతేగాక వేతనాలూ భారంగానే తయారయ్యాయి. భారత్‌తో పోల్చితే అక్కడి ఫ్రెషర్లకు ఎక్కువగా జీతాలివ్వాల్సి వచ్చింది. ఇది ఐటీ కంపెనీల ఆదాయం, లాభాలు, భారత్‌లో ఉద్యోగ నియామకాలనూ ప్రభావితం చేసింది.