Income Tax | ఆర్థిక సంవత్సరం ముగుస్తోందంటే చాలు.. చాలామంది పన్ను ఆదాసహా ట్యాక్స్ ప్లానింగ్‌పై దృష్టి పెడుతారు. కొత్త, పాత పన్నుల విధానాలు వచ్చినప్పటికీ సెక్షన్ 80సీ విషయంలో ఎప్పటికీ కొంత సందిగ్ధతతోపాటు ఆప్షన్స్ విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంచడానికి ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోగల పన్ను రాయితీ విధానమే సెక్షన్ 80సీ. దీని కిందగల పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏటా గరిష్ఠంగా రూ.1.5 లక్షలదాకా పన్ను చెల్లింపులను ఆదా చేసుకోవచ్చు. కానీ పాత పన్నుల విధానాన్ని ఎంపిక చేసుకున్నవాళ్లకే ఈ ప్రయోజనం అందుతుంది.
పీపీఎఫ్ అనేది ఓ స్మాల్ సేవింగ్స్ పెట్టుబడి విధానం. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండటంతో ఇది చాలా సేఫ్. ఇతర పన్ను సాధనాలతో పోల్చితే దీనికి లాకిన్ పీరియడ్ చాలా ఎక్కువ. అయితే ఏడో సంవత్సరం తర్వాత కొద్ది మొత్తాన్ని మన కార్పస్ నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పొందే వడ్డీపైనా ఎలాంటి పన్నూ ఉండదు.
ఇదొక కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ సేవింగ్స్ ప్రోగ్రాం. ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఛాయిస్. అయితే ప్రభుత్వం దీనికి ఒక నిర్దిష్టమైన వడ్డీరేటును నిర్ణయిస్తుంది. ఎన్ఎస్సీ కింద ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. దీనికి కూడా ఐదేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఈ పథకం కింద లభించే వడ్డీపై మాత్రం ట్యాక్స్ ఉంటుంది. మన శ్లాబ్స్‌కు తగ్గట్టు పన్ను పడుతుందని గమనించాలి.
ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను ఆదా కోసం ఉన్న వివిధ సాధనాలను పరిశీలిస్తే..
ఇదో సులువైన పన్ను తగ్గింపు సాధనం. కానీ లాకిన్ పీరియడ్ ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.5 లక్షలదాకా పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఇక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) సురక్షితమన్న విషయం తెలిసిందే.
ఇది సీనియర్ సిటిజన్లకు వర్తిస్తున్న పన్ను విధానం. 60 ఏండ్లకు పైబడినవాళ్లకు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేసే వీలున్నది. ఐదేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే మరో మూడేండ్ల గడువును కూడా పొడిగించుకునే వెసులుబాటు ఉంది. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకూ ఉంటాయి. ఏడాదికి రూ.50వేలకుపైగా వడ్డీ వస్తే, అది ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుందని గమనించండి.
సుకన్య సమృద్ధి స్కీం ఓ అత్యద్భుత పెట్టుబడి సాధనం. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. సుదీర్ఘ లాకిన్ పీరియడ్ ఉన్నప్పటికీ ఆడపిల్లల ఉన్నత చదువు, పెండ్లిళ్లకు ఉపయుక్తంగా ఉంటుంది. 21 ఏండ్లు వచ్చినప్పుడు పెండ్లికి నిధులను వాడుకోవచ్చు. 18 ఏండ్లు లేదా 10వ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులకు పాక్షికంగా ఈ నిధులను తీసుకోవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకే ట్యాక్స్ బెనిఫిట్స్ అందుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో వచ్చే ప్రయోజనంపై ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోవడం మరో అదనపు బెనిఫిట్.
గృహ, విద్యా రుణాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని పన్ను రాయితీలను పొందవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 24బీ కింద గృహ రుణంపై చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకూ మినహాయింపు పొందవచ్చు. అలాగే సెక్షన్ 80సీ కింద అసలు మొత్తంపై కూడా గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80ఈ ప్రకారం ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలపై కూడా ప్రయోజనాలు అందుకోవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ.. పన్ను లాభాలను పొందాలని అనుకునేవాళ్లకు ఈక్విటీ లింక్డ్ సేవిం గ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్) ఉత్తమ సాధనం. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ఈ స్కీం కింద కూడా గరిష్ఠంగా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదా చేసుకోవచ్చు. దీనికి కూడా మూడేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పద్ధతిలో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్‌ను దీన్నుంచి ఆశించవచ్చు.
సాధారణంగా ఏడాది ప్రారంభం నుంచే మనం ట్యాక్స్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆఖర్లో సిద్ధమైతే అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమే. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీతోపాటు 80సీసీసీ, 80సీసీడీ, 80ఈ, 80ఈఈలతోనూ పన్ను ప్రయోజనాలుంటాయి. 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంలపై పన్ను క్లెయిం చేసుకోవచ్చు. రూ.5వేలకు లోబడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల హెల్త్ చెకప్‌లకు చెల్లించే సొమ్ముపైనా క్లెయిం చేసుకోవచ్చు. ఇక 80జీ కింద వచ్చే నెల మార్చి ఆఖర్లోగా అర్హత ఉన్న చారిటీ సంస్థలకిచ్చే విరాళాలనూ పన్ను ఆదా కోసం క్లెయిం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటేనే ఉంటాయి.
-నాగేంద్ర సాయి కుందవరం