Postal Schemes : వివిధ రకాల పోస్టాఫీస్ పథకాల్లో (Post office schemes) చేరే ప్రక్రియను భారత తపాలా శాఖ మరింత సులభతరం చేసింది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), టైమ్ డిపాజిట్ (TD), కిసాన్ వికాస్ పత్ర (KVP), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) లాంటి ఖాతాలను పూర్తి డిజిటల్ పద్ధతిలో తెరిచే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఆయా ఖాతాలు సులువుగా తెరిచే వెసులుబాటును కల్పించింది. పేపర్ వర్క్ అవసరాన్ని పూర్తిగా తప్పించింది.
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా తెరవడానికి తపాలాశాఖ ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ విధానాన్ని అనుసరిస్తోంది. ఏప్రిల్ 24 నుంచి దీన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), టైమ్ డిపాజిట్ (TD), కిసాన్ వికాస్ పత్ర (KVP), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) లాంటి పాపులర్ పథకాలకు విస్తరించింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. పోస్టాఫీస్ కార్యాలయాల్లో ఆయా ఖాతాలన్నీ ఆధార్ ఈకేవైసీ సాయంతో సులువుగా తెరవవచ్చని పేర్కొన్నది.
పైన పేర్కొన్న పోస్టాఫీస్ ఖాతాల్లో ఏదైనా తెరవాలంటే ఇప్పుడు డిపాజిట్ వోచర్, ఫిజికల్ ఫారాలు నింపాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. పూర్తిగా డిజిటల్ విధానంలో ఖాతా తెరువనున్నారు. అయితే కొత్తపద్ధతితోపాటు పాత పద్ధతిని కూడా అందుబాటులో ఉంచనున్నారు. కావాలనుకున్న వాళ్లు పేపర్ వర్క్‌తో కూడా ఖాతాను తెరవచ్చు. డిజిటల్ పద్ధతిలో ఖాతా తెరవడానికి వెళ్లినప్పుడు పోస్టల్ అసిస్టెంట్ తొలుత డిపాజిటర్ నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.
తర్వాత పేరు, స్కీమ్ టైప్, డిపాజిట్ మొత్తం లాంటి వివరాలు నమోదు చేస్తారు. వివరాలన్నీ ధ్రువీకరించుకున్నాక తుది సబ్మిషన్ కోసం మరోసారి ఖాతాదారు నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు. దాంతో లావాదేవీ పూర్తవుతుంది. డిపాజిట్ ఫారం నింపాల్సిన అవసరం రాదు. వివరాల నమోదు ప్రక్రియలో ఆధార్‌లోని తొలి 8 నంబర్లను పోస్టల్ సిబ్బంది మాస్క్ చేస్తారు. చివరి నాలుగు నంబర్లను సేకరిస్తారు. కాబట్టి భద్రతపై కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.