గత ఏడాది సెప్టెంబర్ 22దాకా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తించేది. ఉదాహరణకు వార్షిక ప్రీమియం రూ.12,000గా ఉంటే.. జీఎస్టీ రూ.2,160తో మొత్తం రూ.14,160 చెల్లించాల్సి వచ్చేది. ఏండ్ల తరబడి పాలసీదారులు ఈ భారాన్ని మోశారు. నిజానికి టర్మ్ ఇన్సూరెన్స్లేగాక, యులిప్స్, ఎండోమెంట్ పాలసీలు తదితర వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపైనా పన్ను మినహాయింపు లభించింది. ఈ లెక్కన ఇప్పుడు కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఏటా రూ.8,000 ప్రీమియం చెల్లిస్తున్నైట్టెతే.. 30 ఏండ్ల కాలపరిమితితో బీమాను కొన్నవారికి ఏడాదికి రూ.1,440 చొప్పున రూ.43,200 ఆదా అయినట్టే. ఇలా పాలసీ సొమ్ము పెరిగినకొద్దీ ఆదా అయ్యే మొత్తాలూ పెరుగుతాయి. కానీ ఈ మొత్తాలనూ పాలసీ కవరేజీని పెంచుకొనేందుకే ఉపయోగించుకోవడం ఉత్తమం. అయితే బీమా పాలసీని కొనేటప్పుడు కొన్ని ప్రమాణాలను పాలసీదారులు తప్పక గమనించాలని, లేకపోతే ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు.
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఏటా వార్షిక డాటాను విడుదల చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం విషయానికే వస్తే.. 10,11,880 మరణాల క్లెయిమ్‌లు వచ్చాయి. వీటిలో బీమా సంస్థలు దాదాపు 10 లక్షల క్లెయిమ్‌లను సెటిల్మెంట్ చేశాయి. వాటి విలువ రూ.33,697 కోట్లు. 17,333 క్లెయిమ్‌లను మాత్రమే తిరస్కరించాయి. వీటి విలువ రూ.976 కోట్లు. దీన్నిబట్టి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (సీఎస్ఆర్) క్లెయిమ్ (కౌంట్)ల వారీగా 98.32 శాతంగా ఉన్నది. నగదు (అమౌంట్)పరంగా రూ.97.18 శాతం సీఎస్ఆర్ ఉన్నది. అయితే దీన్ని చూసి పాలసీదారులు కంపెనీలను ఎంచుకుంటూపోతున్నారు. కానీ ఇక్కడే సీఎస్ఆర్ కౌంట్, సీఎస్ఆర్ అమౌంట్ మధ్యనున్న ఆ చిన్న వ్యత్యాసం కీలకం. ప్రతీ 100 క్లెయిమ్‌లలో 99 చిన్న చిన్న క్లెయిమ్‌లను సెటిల్ చేసి, కోటి రూపాయల పెద్ద క్లెయిమ్‌ను తిరస్కరిస్తూపోతున్న బీమా కంపెనీలు రేషియోలను పదిలంగా కాపాడుకుంటున్నాయి మరి. కాబట్టి భారీ పాలసీలను తీసుకునే పాలసీదారులు.. సదరు పాలసీల్లో ఆయా సంస్థల రేషియో ఏవిధంగా ఉందో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐఆర్డీఏఐ అధికారిక వెబ్సైట్ (irdai.gov.in)లో వార్షిక నివేదికల విభాగంలో ఏటా ఈ వివరాలను తెలుసుకోవచ్చంటున్నారు.
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే?
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా జీవిత బీమా పాలసీ. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు చనిపోతే కుటుంబ సభ్యుల (నామినీలు)కు పెద్ద మొత్తంలో కవరేజీ సొమ్ము లభిస్తుంది. ఇక మీ బడ్జెట్‌నుబట్టి రెగ్యులర్, లిమిటెడ్, సింగిల్ ప్రీమియంలను ఎంచుకోవచ్చు. రెగ్యులర్ ప్రీమియంలలో నెల, త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన చెల్లించాలి. లిమిటెడ్ ప్రీమియంలలో 20 ఏండ్ల పాలసీకి పదేండ్లు చెల్లిస్తే సరిపోతుంది. సింగిల్ ప్రీమియంలో పాలసీ మొత్తానికి ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్‌లలో ప్రధానంగా లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇన్సూరెన్స్, డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్, ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్లుంటాయి.