గౌతమ్ అదానీ, ఏషియాస్ బిజీయెస్ట్ డీల్‌మేకర్
-డిసెంబర్ 14, 2022
హౌ ఏ బిగ్ షార్ట్ కాస్ట్ ఇండియాస్ అదానీ ఎంపైర్ 100 బిలియన్ డాలర్స్
-ఫిబ్రవరి 9, 2023
వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి రెండు నెలల వ్యవధిలో ప్రఖ్యాత ‘బ్లూమ్‌బర్గ్’ బిజినెస్ వీక్ మ్యాగజైన్లో ప్రచురించిన రెండు కవర్స్టోరీలు ఇవి.
ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో అదానీ మూడో స్థానంలో ఉండటాన్ని బ్లూమ్‌బర్గ్ మొదటి స్టోరీ విశ్లేషించగా.. ‘హిండెన్‌బర్గ్’ రిసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ పతనమైన విధానాన్ని రెండో స్టోరీ వివరించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతున్నదని అమెరికన్ పరిశోధక సంస్థ ‘హిండెన్‌బర్గ్’ రిసెర్చ్ 16 రోజుల క్రితం చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంపద దాదాపు రూ.10 లక్షల కోట్లవరకు ఆవిరైంది. అదానీ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపరులు పునరాలోచిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఉదంతంపై ప్రఖ్యాత ‘బ్లూమ్‌బర్గ్’ బిజినెస్‌వీక్ మ్యాగజైన్లో తాజాగా ఓ కథనాన్ని కవర్‌స్టోరీగా ప్రచురించింది.
‘హిండెన్‌బర్గ్’ ఆరోపణలు, దానిపై అదానీ గ్రూప్ స్పందన, అదానీ గ్రూప్ షేర్ల పతనం తదితర ఆంశాలను ఈ కథనంలో విశ్లేషించింది. దీంతోపాటు వ్యాపారిగా మారకముందు గౌతమ్ అదానీ పరిస్థితి, ప్రధాని మోదీతో ఆయన సాన్నిహిత్యం వంటి కీలక అంశాలను ప్రత్యేకంగా చర్చించడం గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో అదానీ గ్రూప్ పాతుకుపోయిన విధానం,సామాన్యుల దైనందిన జీవితాన్ని అదానీ గ్రూప్ ఎంతలా ప్రభావితం చేస్తున్నదన్న అంశాన్ని ఉదాహరణలతో ప్రచురించింది. ‘బ్లూమ్‌బర్గ్’ ప్రచురించిన కవర్స్టోరీపై ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
కాలేజీ డ్రాపౌట్ నుంచి అపర కుబేరుడిగా..
కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన గౌతమ్ అదానీ.. అపర కుబేరుడిగా ఎలా మారారన్న విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో విపులంగా చర్చించింది. పబ్లిసిటీకి దూరంగా ఉండే అదానీ.. అహ్మదాబాద్‌లో జన్మించారు. ఎనిమిది మంది సంతానంలో ఆయన ఏడోవాడు. తండ్రి బట్టల వ్యాపారి. తల్లి గృహిణి. కళాశాల విద్య కోసం ముంబైలోని ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకొన్న అదానీ.. ఆరు నెలలు తిరగకుండానే కాలేజీ మానేశారు. తర్వాత వజ్రాల ట్రేడింగ్‌లోకి దిగారు. అనంతరం తన సోదరుడి ప్లాస్టిక్ కర్మాగారంలో పనిచేశారు. 1988లో వస్తువుల విక్రయ కంపెనీని ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని పోర్టు కాంట్రాక్టు దక్కడంతో ఆయన దశ తిరిగింది. బొగ్గు గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, డాటా కేంద్రాలు, విద్యుదుత్పత్తి, గ్యాస్ పంపిణీ, సిమెంట్ తయారీ, వంటనూనెలు, మీడియా తదితర రంగాలకు అదానీ వ్యాపారాన్ని విస్తరించారు.
మోదీతో సాన్నిహిత్యం గురించి..
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రాష్ర్టానికి చెందిన అదానీ ఆస్తులు ఎంత ఉన్నాయి? మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనతికాలంలోనే ఎలా పెరిగాయి అన్నదానిని కూడా ‘బ్లూమ్‌బర్గ్’ విశ్లేషించింది. దేశంలో తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమంటూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ పథకానికి అదానీ పిల్లర్‌గా మారారని కథనంలో వెల్లడించింది. తద్వారా దేశంలోని మెజారిటీ ప్రాజెక్టులు అదానీ గ్రూప్‌నకే ప్రభుత్వం కట్టబెడుతున్నదన్న విషయాన్ని పరోక్షంగా ఎత్తిచూపింది. 2000 సంవత్సరం నుంచే వీళ్లిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారని, మోదీ దేనిపై ఆసక్తి కనబరుస్తారో.. ఆ రంగంలోకి అదానీ ప్రవేశిస్తారని పేర్కొన్నది.
సామాన్యులపై ప్రభావం ఎంతంటే?
‘భారతదేశ ఆధునిక చరిత్రలో మరే ఇతర వ్యక్తి ఇంత తక్కువ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో ఈ స్థాయిలో తన ఉనికిని చాటుకోలేదు’ అని బ్లూమ్‌బర్గ్ పేర్కొన్నది. అంతేకాదు, సామాన్యుల దైనందిన జీవితాన్ని అదానీ గ్రూప్ కంపెనీలు ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఉదాహరణతో వివరించింది. ‘గనుల నుంచి బొగ్గును వెలికితీసిన అదానీ మైనింగ్ కంపెనీ.. రైల్వేలైన్లు, రోడ్ల ద్వారా అదానీ పోర్టుల్లోకి దానిని చేరుస్తున్నది. అక్కడి నుంచి ఆ బొగ్గు అదానీ పవర్ప్లాంట్లకు వస్తున్నది. అక్కడ తయారైన విద్యుత్తు.. అదానీ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా ఇంటింటికీ చేరుతున్నది. విద్యుత్తు సౌకర్యం ఉన్న ఆ ఇండ్లు అదానీ సిమెంట్‌తోనే (అంబుజా, ఏసీసీ సిమెంట్) కట్టారు.
ఆ ఇండ్లలోని ఓ సామాన్య కుటుంబం అదానీ గ్యాస్ (టోటల్ గ్యాస్) స్టవ్ మీద, అదానీ వంటనూనెతోనే (ఫార్చ్యూన్ కుకింగ్ ఆయిల్) తమ రాత్రి భోజనాన్ని సిద్ధం చేసుకొన్నది. భోజనం చేసే సమయంలో ఆ కుటుంబం వచ్చే వేసవిలో ఎక్కడికి విహారానికి వెళ్లాలన్న విషయాన్ని చర్చించుకొంటున్నది. టూర్‌కు వెళ్లాలంటే, విమానాన్ని ఎక్కడానికి వెళ్లే ఎయిర్‌పోర్టులు కూడా అదానీ గ్రూప్ పరిధిలోనే ఉన్నాయి. విహార యాత్ర ప్రాంతాల కోసం మొబైల్ ఫోన్లో వెదుకుతున్న డాటా హిస్టరీ కూడా అదానీ డాటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది’.. అంటూ అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఏ స్థాయికి చేరిందో ‘బ్లూమ్‌బర్గ్’ కవర్‌స్టోరీలో ఎత్తిచూపింది.