సోమవారం 01 మార్చి 2021
Business - Dec 21, 2020 , 00:19:20

బీమా చిన్నది ధీమా పెద్దది

బీమా చిన్నది ధీమా పెద్దది

ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే బీమాగల వ్యక్తికి ఉండే ధీమానే వేరు. కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇన్సూరెన్స్‌లున్నవారు ఏ దిగులూ లేకుండా ధైర్యంగా బ్రతికేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఇన్సూరెన్స్‌ పాలసీలు చిన్న సైజుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. మీ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా వీటిని ఎంచుకుని మీరూ నిర్భయంగా జీవించవచ్చు. అందుకే మీ కోసం చిన్న బీమా పాలసీల వివరాలను అందిస్తున్నాం.

చిన్న బీమా ప్లాన్లు అంటే? 

‘పెట్టుబడి చిన్నది.. ప్రయోజనం పెద్దది’ బీమా రంగం ప్రధాన నినాదం ఇదే. ఇందుకు తగ్గట్లే ప్రతి వ్యక్తికీ బీమా ప్రయోజనాలు అందాలని వివిధ సంస్థలు చిన్న బీమా ప్లాన్లను తీసుకొస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి టర్మ్‌ హెల్త్‌ లేదా జీవిత బీమాలతో వీటిని పోల్చలేం. పరిమిత స్థాయిలోనే వీటి లాభాలుంటాయి. కానీ కొత్త పాలసీ కొనుగోలుదారులకు ఇవి ఎంతో అనుకూలం. మలేరియా, డెంగీ తదితర దోమలు, ఈగల ద్వారా వ్యాపించే వ్యాధులకు బీమా కవరేజీతోపాటు ఫిట్నెస్‌, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు, వస్తువుల డ్యామేజీ, అపహరణలకు బీమా సౌకర్యాలు ఈ పాలసీల్లో ఉంటాయి. 


ప్రీమియంలు స్వల్పమే

తక్కువ ప్రీమియం, తక్కువ కవరేజీతో చిన్న బీమా పాలసీలుంటాయి. సాధారణ బీమా పాలసీలతో పోల్చితే ఖర్చు తక్కువే. ఇదో నాన్‌-కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌. లైఫ్‌, నాన్‌-లైఫ్‌ కవరేజీలతో వివిధ డిజిటల్‌ వేదికల ద్వారా స్వల్ప శ్రేణి ప్రీమియంలుగల బీమా పాలసీలను పలు ఇన్సూరెన్స్‌ సంస్థలు, మధ్యవర్తులు అమ్ముతున్నారు. ఒక్కో దగ్గర ఒక్కో ధరతో ఇవి లభిస్తున్నాయి.

తేలిగ్గా కొనవచ్చు

చిన్న బీమా పాలసీలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటి గురించి యువతకు ఎక్కువగానే తెలిసి ఉంటుంది. వీటి కొనుగోలు ప్రక్రియ అంతా డిజిటల్‌ వేదికలపైనే సాగుతుంది. ప్రపోజల్‌ ఫామ్‌ లేదా వైద్య పరీక్షల అవసరం ఉండదు. దీన్ని పాలసీ కొనుగోలుదారులకు గొప్ప ప్రోత్సాహకంగా చెప్పుకోవచ్చు. 

నిపుణులు ఏమంటున్నారు?

చిన్న బీమా పాలసీలు.. తొలిసారి బీమా కొనుగోలుదారులకు అనువైనవని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి ఇన్సూరెన్స్‌లకు ఇవి ప్రత్యామ్నాయం కాబోవని తేల్చిచెప్తున్నారు. ఈ క్రమంలోనే సమగ్ర రీతిలో జీవిత-ఆరోగ్య బీమాలు ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తాత్కాలిక అవసరాలకే చిన్న బీమా పాలసీలు పనికొస్తాయంటున్న నిపుణులు.. నష్టాలను పరిమితం చేసుకోవడానికి మాత్రం చక్కగా ఉపయోగపడుతాయని స్పష్టం చేస్తున్నారు.

ఏయే ఆఫర్లు


ఈ పాలసీల్లో చాలావరకు వ్యాధులు, ప్రయాణం, మొబైల్‌, సైకిల్‌ దొంగతనాలు, హోమ్‌ ప్రొటెక్షన్‌, ఫిట్నెస్‌ కవరేజీలున్నాయి. ఉదాహరణకు మొబీక్విక్‌తో మ్యాక్స్‌ బూపా కలిసి మలేరియా, డెంగీ వంటి వ్యాధులకు బీమాను అందిస్తున్నది. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్‌, మొబీక్విక్‌ భాగస్వామ్యంలో ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌ బాధితుల రక్షణార్థం రూ.50వేల సైబర్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉన్నది. బజాజ్‌ అలియాంజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో కూడా సైబర్‌ లయబిలిటీ కవరేజీలనిస్తున్నాయి. ఇక మొబైల్‌ ఫోన్ల డ్యామేజీ, అపహరణల కోసం గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వివిధ ఆఫర్లను కల్పిస్తున్నది. టాటా-ఏఐజీ, చోళ ఎంఎస్‌లతో కలిసి టోఫీ ఇన్సూరెన్స్‌.. సైకిళ్లపై దొంగతనాలు, డ్యామేజీల కోసం బీమా అందిస్తున్నది. సైకిల్‌తోపాటు రైడర్‌కూ ఇన్సూరెన్స్‌ ఇస్తున్నది.


VIDEOS

logo