Electronics | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఉద్యోగ కల్పనలో ఎలక్ట్రానిక్స్ రంగం దూసుకుపోతున్నది. వచ్చే మూడేండ్లలో ఈ రంగంలో 1.2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని టీమ్‌లీజ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరిలో 30 లక్షల మంది ప్రత్యక్షంగాను, మరో 90 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నవారిలో 10 లక్షల మంది ఇంజినీర్లు, 20 లక్షల మంది ఐటీఐ ప్రొఫెషనల్స్, 2 లక్షల మంది కృత్రిమ మేధస్సు, మెషిన్‌లెర్నింగ్, డాటా సైన్సెస్, నాన్-టెక్నికల్ విభాగానికి చెందిన 90 లక్షల మందికి ఉపాధి లభించనున్నది.
రిలయన్స్ చేతికి కార్కినోస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థయైన ఆర్ఎస్బీవీఎల్ ..హెల్త్‌కేర్ టెక్నాలజీ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా కార్కినోస్ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ రూ.375 కోట్లు. జూలై 24, 2020లో ప్రారంభమైన కార్కినోస్..హెల్త్‌కేర్ టెక్నాలజీ సేవల్లో భాగంగా రోగ నిర్థారణ, నిర్వహణ, అలాగే క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే టెక్నాలజీ సేవలను అందిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ టర్నోవర్ రూ.22 కోట్లుగా ఉన్నది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 60 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకొని వైద్య సేవలు అందిస్తున్నది.