కృష్ణగిరి(తమిళనాడు), ఆగస్టు 15: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా గ్రూపు తాజాగా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఒకేసారి మూడు మాడళ్లను విడుదల చేసిన సంస్థ..మరో రెండు మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో రూపొందించిన ఈ బైకులను ‘సంకల్ప 2024’ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో కంపెనీ ఫౌండర్ అగర్వాల్ విడుదల చేశారు. మూడు రకాల్లో లభించనున్న ఈ మోటార్‌సైకిళ్లు రూ.1,99, 999 గరిష్ఠ ధరలో లభించనున్నాయి. వీటిలో రోడ్‌స్టర్ ఎక్స్ మాడల్ రూ.74,999 నుంచి రూ.99,999 లోపు, రోడ్‌స్టర్ రూ.1,04, 999 నుంచి రూ.1,19, 999 లోపు, రోడ్స్టర్ప్రో మాడల్ ధర రూ.1,99, 999 నుంచి రూ.2,49,999కి లభించనున్నాయి. ఈ బైకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. కానీ, రోడ్‌స్టర్ ప్రో మాత్రం వచ్చే ఏడాది నాలుగో త్రైమాసికం(మార్చి 2026) నుంచి అందుబాటులోకి రానున్నట్లు అగర్వాల్ చెప్పారు.
రోడ్‌స్టర్ ప్రో : 52 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన ఈ మాడల్ కేవలం 1.9 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. గంటకు 194 కిలోమీటర్లు ప్రయాణించే ఈ బైకు సింగిల్ చార్జింగ్‌తో 579 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 10 ఇంచుల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, డిస్క్ బ్రేక్‌తో ఏబీఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.