ముంబై, ఆగస్టు 14: విద్యుత్‌తో నడిచే ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ నష్టాల పరంపర కొనసాగుతున్నది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.347 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ రూ.267 కోట్లు నష్టపోయింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,243 కోట్ల నుంచి రూ.1,644 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు రూ.1,849 కోట్లకు పెరగడం, వాహన ధరలు తగ్గించడం వల్లనే నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత త్రైమాసికంలోసంస్థ 1,25,198 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
ఎంటార్ లాభంలో క్షీణత
హైదరాబాద్, ఆగస్టు 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పన్నులు చెల్లించిన తర్వాత రూ.4.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఎంటార్ టెక్నాలజీస్ ప్రకటించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమిసికంలో వచ్చిన రూ.4.9 కోట్ల లాభం కంటే ఇది 9.1 శాతం తక్కువ. అలాగే కంపెనీ ఆదాయం రూ.143 కోట్ల నుంచి రూ.128.3 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది.
రాంకీ ఇన్ఫ్రా లాభం 68 కోట్లు
హైదరాబాద్, ఆగస్టు 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.67.58 కోట్ల నికర లాభాన్ని గడించింది రాంకీ ఇన్ఫ్రా. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.101.34 కోట్ల లాభంతో పోలిస్తే 33.31 శాతం తగ్గింది. కంపెనీ విక్రయాలు మాత్రం ఏడాది ప్రాతిపదికన 2.21 శాతం పెరిగి రూ.569.13 కోట్లకు చేరుకున్నాయి.
స్పైస్‌జెట్ ప్రాఫిట్ డౌన్
న్యూఢిల్లీ, ఆగస్టు 14: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను రూ.149.96 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.204.56 కోట్ల లాభంతో పోలిస్తే 27 శాతం తగ్గినట్లు పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,268 కోట్ల నుంచి 2,067 కోట్లకు పడిపోయినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. అటు నిర్వహణ ఖర్చులు రూ.1,917.25 కోట్లకు తగ్గాయి. మరోవైపు, క్యూఐపీ రూట్లో రూ.3 వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డు అనుమతునిచ్చింది.