New Year | కొత్త ఏడాది వస్తోందంటే చాలు.. మనలో చాలామంది ఏవేవో తీర్మానాలు చేసేస్తూంటాం. జనవరి మొదలు ఇది చేసేద్దాం.. అది చేసేద్దాం అని ఎన్నో కలలు, దృఢ నిర్ణయాలు తీసుకుంటాం. అయితే వాటిల్లో 80 శాతానికిపైగా నిర్ణయాలు మొదటి నెల ముగిసేలోగానే అటకెక్కేస్తాయి. అలాంటి వాటిల్లో డబ్బులు ఆదా చేయాలనేది కూడా ప్రధానంగా ఉంటుంది. కానీ ఖర్చు చేసే విషయంలో మాత్రం వెనక్కి తగ్గం. అలా అదనపు ఆదాయం, ఖర్చుల నియంత్రణలో క్రమశిక్షణ పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ నూతన సంవత్సరంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.
ప్లానింగ్‌పై అశ్రద్ధా..
ప్రతీ ఒక్కరికీ ప్లాన్ తప్పక అవసరం. ఈ ఏడాది ప్రపంచమంతటా ఉద్యోగ కోతలు, మాం ద్యం, ద్రవ్యోల్బణమే. ఏ రంగం లో పనిచేస్తున్నా.. వీటి ప్రభావం నుంచి బయటపడే అవకాశం మాత్రం లేదు. అందుకే వచ్చే ఏడాది ఆరంభంలో మనం చేసే కొద్దిపాటి ప్లానింగ్ మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని కాస్త నిబ్బరంగా ఉంచుతుంది. చక్కని ఆర్థిక ప్రణాళికతో రాబోయే సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు.
బీమా కవరేజీ
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితిలో ఇప్పుడు మానవ జాతి పడిందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆరోగ్యంగానే ఉన్నాం.. ఏమవుతుందిలే అన్న దీమా అస్పలు పనికిరాదు. కరోనా దెబ్బకు ఎంతోమంది మంచంపట్టారు. అందుకే ఆరోగ్య బీమాలు తప్పనిసరి. ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కనీసం పది లక్షలకైనా తీసుకోవాలి. జీవిత బీమా విషయంలో కూడా అజాగ్రత్త వద్దు. మనీబ్యాక్ గురించి వెంపర్లాడకుండా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ ఏడాది జీతానికి పదిరెట్ల కవరేజీ ఉండేలా చూసుకోండి. అంటే మీకు ఏడాదికి రూ.6 లక్షల జీతం ఉంటే.. రూ.60 లక్షలకు పాలసీ తీసుకోండి.
అత్యవసర నిధి
గడిచిన 2-3 ఏండ్లుగా ప్రతీ ఒక్కరి ఆదాయంలోనూ ఒడిదుడుకులు సాధారణమైపోయాయి. వ్యయ నియంత్రణలో భాగంగా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితితో వ్యాపారాలు మందగించిన పరిస్థితి. అందుకే 6 నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. నెలనెలా ఇంత మొత్తం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని అనుకునేంత నగదునైనా సరే పక్కన ఉంచుకోండి. దీనివల్ల ఆకస్మిక ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతాం.
ఆర్థిక క్రమశిక్షణ
ఆర్థిక క్రమశిక్షణ అందరికీ తప్పనిసరి. అదుపు తప్పిన ఖర్చులు పతనానికే దారితీస్తాయి. మితిమీరిన రుణాలు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి దింపడమేగాక, మీ రుణ చరిత్రనూ మసకబారుస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ రిస్కులో పడుతుంది. అయితే అప్పుల బాధ, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్, ఈఎంఐ బౌన్సులు లేకపోతే క్రెడిట్ స్కోర్ సురక్షితమే. కానీ ఈ స్కోర్ పడిపోతూ వస్తోందంటే.. మీలో ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పుతోందని అర్థం. అందుకే కనీసం మన క్రెడిట్ స్కోర్ 800కంటే పైనే ఉండేలా చూసుకోవాలి. ఎంత ఎక్కువగా ఈ స్కోర్ ఉంటే.. అంత ఈజీగా, తక్కువ వడ్డీరేట్లకే మనకు రుణాలు లభిస్తాయని అర్థం.
ఇంటి కొనుగోలు
నూతన సంవత్సరంలో సొంతింటి కల సాకారాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అదనపు ఆదాయాలపై దృష్టిపెట్టి ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకెళ్లండి. అయితే స్థోమతకు మించి ఇండ్ల కొనుగోళ్లకు దిగడం ప్రమాదకరం. మీ బడ్జెట్లో కొనుక్కోవడం ఉత్తమం. ఇక గత ఆరు నెలల్లో ఆర్బీఐ 2.25 శాతం వడ్డీరేట్లను పెంచింది. దీంతో ఇప్పటికే ఇండ్ల రుణాలు తీసుకున్నవారిపై పెను భారమే పడింది. అయితే మీ హౌజింగ్ లోన్ టెన్యూర్ ఎంత పెరిగిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. పెరిగిన భారం తగ్గించుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రీ-పేమెంట్స్ చేయండి.
పెట్టుబడులు
మనం ఖర్చు చేయగా మిగిలిన ఎంతోకొంత మొత్తాలను పెట్టుబడులుగా పెడ్తూంటాం. అయితే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉందో ఎప్పుడైనా గమనించారా? ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఏడాదికి 8 శాతం వడ్డీ లభిస్తోందని అనుకుందాం. ఇందులో నుంచి ద్రవ్యోల్బణం కింద 6శాతం తీసేయాల్సి ఉంటుంది. పైన చెప్పిన పరిస్థితుల్లో రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కేవలం 2 శాతం మాత్రమే. అందుకే ఇన్ఫ్లేషన్ను బీట్చేసేలా రిటర్నులు ఉండాలి. ఇందుకోసం మన వయస్సు ఆధారంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను పెట్టడం లాభదాయకం. కనీసం 15 శాతమైనా రిటర్న్స్ ఉండే విధంగా మీ ప్లానింగ్ ఉండాలి.