Mutual Fund | గత నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి నెలవారీ ప్రాతిపదికన 14 శాతం పతనమై.. రూ.35,943 కోట్లకు చేరుకుంది. పలు ఆర్థికపరమైన అంశాలకు తోడుగా.. వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కారణంగా ఏర్పడిన అస్థిరత కారణంగా పెట్టుబడులు తగ్గినట్లుగా అంచనా. అయినా కూడా ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో నికర పెట్టబడులు పెరగడం గమనార్హం. నికర పెట్టబడులు నవంబర్‌లో వరుసగా 45వ సారి పెరిగాయి. ఇది పెట్టుబడిదారుల్లో మ్యూచువల్ ఫండ్స్‌పై పెరుగుతున్న ఆకర్షణకు సూచన అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతున్నాయి.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో సిప్‌లో రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల అక్టోబర్‌లో రూ.25,323 కోట్లుగా ఉన్నాయి. డేటా ప్రకారం.. గత నెలలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మొత్తం రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో రూ.2.4 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 75 శాతం తక్కువ. డెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ భారీగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లతో పోలిస్తే నవంబర్‌లో కేవలం రూ.12,915 కోట్లు మాత్రమే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడులు తగ్గినప్పటికీ, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలో ఉన్న నికర ఆస్తులు (AUM) అక్టోబర్‌లో రూ.67.25 లక్షల కోట్ల నుంచి రూ.68.08 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం.