Hero’s Legal Fight | సగటు భారతీయుడికి టూ వీలర్స్ చేరువ కావడంలో హీరో మోటో కార్ప్ కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్న ముంజాల్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పొడచూపాయి. కర్బన ఉద్గారాల నియంత్రణకు ప్రస్తుతం అంతా విద్యుత్ వెహికల్స్ వైపు మొగ్గుతున్నారు. ఈ రంగంలోకి ఎంటరవ్వాలని హీరో మోటో కార్ప్స్ అధినేత పవన్ ముంజాల్ సన్నాహాలు చేస్తున్నారు. హీరో బ్రాండ్‌పైనే విద్యుత్ బైక్స్ తేవాలని నిర్ణయించుకున్నారు. వచ్చే మార్చికల్లా విద్యుత్ వాహన రంగంలో.. హీరో ఎలక్ట్రిక్‌కు పోటీగా స్కూటీని విడుదల చేయాలని హీరో మోటో కార్ప్ యోచిస్తున్నది. ఇదే ముంజాల్ కుటుంబంలో వివాదానికి కారణమవుతున్నది. పవన్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటో కార్ప్‌కు వ్యతిరేకంగా హీరో ఎలక్ట్రిక్ ఫౌండర్ విజయ్ ముంజాల్, ఆయన కొడుకు, సంస్థ ఎండీ నవీన్ ముంజాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన సోదరుడు పవన్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటో కార్ప్ నుంచి వచ్చే విద్యుత్ టూ వీలర్స్‌కు హీరో బ్రాండ్ వాడకుండా ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ కేసు బుధవారం విచారణకు రానున్నది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో హీరో బ్రాండ్ వాడకంపై తలెత్తిన వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని విజయ్ ముంజాల్ వర్గం భావిస్తున్నదని హీరో మోటో కార్ప్ వర్గాల కథనం. కానీ పవన్ ముంజాల్ వర్గంతో మధ్యవర్తిత్వానికి జరిగిన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. అందువల్లే విజయ్ ముంజాల్, ఆయన తనయుడు నవీన్ ముంజాల్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు.
హీరో గ్రూప్‌కు సారధ్యం వహిస్తున్న ముంజాల్ కుటుంబం 20 కంపెనీలను నిర్వహిస్తున్నది. ఈ కంపెనీల వ్యాపార లావాదేవీల నిర్వహణ బాధ్యతలను 2010లో విభజించుకున్నారు. దీని ప్రకారం బ్రిజ్ మోహన్‌లాల్ నలుగురు కొడుకులు పవన్ కాంత్ ముంజాల్, సునీల్ కాంత్ ముంజాల్, సుమన్ కాంత్ ముంజాల్, కీ.శే. రమన్ కాంత్ ముంజాల్లకు జేవీతో కూడిన హీరో హోండా హక్కులు వచ్చాయి. అది తర్వాత హీరో మోటోకార్ప్‌గా మారింది.
బ్రిజ్‌మోహన్‌లాల్ సోదరుడు దయానంద్ ముంజాల్ కుమారుడు విజయ్ ముంజాల్‌కు హీరో బ్రాండ్‌పై ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ హక్కులు లభించాయి. ఈ కుటుంబంలో ఇంకా బ్రిజ్ మోహన్‌లాల్ సోదరులు ఓపీ ముంజాల్, సత్యానంద్ ముంజాల్ కూడా ఉన్నారు. 2010లో కుదిరిన ఒప్పందం ప్రకారం నలుగురు ముంజాల్ కుటుంబ వారసులు వివాదాలు తలెత్తితే మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కానీ పవన్ ముంజాల్ అందుకు భిన్నంగా ముందుకు వెళుతుండటంతో వివాదం ప్రారంభమైనట్లు సమాచారం. అయితే, హైకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పవన్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటో కార్ప్స్ తన ఉత్పత్తులను ఇతర బ్రాండ్‌తో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి:
Conflict in Hero Family| హీరో ఫ్యామిలీలో రచ్చ.. ‘ముంజాల్స్’లో విభేదాలు.. ఎందుకంటే?!