కొండాపూర్, ఆగస్టు 29 : ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన ఎంఎస్ఎన్ గ్రూపు తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఎంఎస్ఎన్ రియల్టీని స్థాపించింది. ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ గ్రూపు ఫౌండర్, సీఎండీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణరంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటడానికి ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు, ముఖ్యంగా వినియోగదారులకు నాణ్యత ప్రమాణాలతో సకల సౌకర్యవంతమైన గృహాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
ఇందుకు సంబంధించి హైదరాబాద్లో ఎంఎస్ఎన్ రియాలిటీ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఫార్మా రంగంలో ఎంతో కాలంగా సుధీర్ఘ సేవలనందిస్తున్న ఎంఎస్ఎన్ గ్రూపు.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రత్యేక ముద్రను వేసేలా సేవలను అందించనున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలను వినియోగదారులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, వచ్చే రెండు నెలలో ప్రభుత్వ అనుమతులతో హైదరాబాద్లో తమ మొదటి ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.