Car Sales | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమలులోకి తీసుకువచ్చింది. నవరాత్రి (ఈ నెల 22న) వేడుకల తొలిరోజున అమలులోకి రాగా.. ఆటో మొబైల్ రంగానికి భారీగా ఊతమిచ్చాయి. ఓ వైపు జీఎస్టీ సంస్కరణలు.. మరో వైపు నవరాత్రి వేడుకల ప్రారంభంతో దేశంలోని అన్ని కార్ల షోరూమ్‌లు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. వినియోగదారుల రద్దీ పెరగడంతో పలు కంపెనీలు సోమవారం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపాయి. కేంద్రం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా చిన్న కార్లు, ఎస్‌యూవీలపై 28 నుంచి 18శాతానికి జీఎస్టీ తగ్గించిన విషయం తెలిసిందే. ఇది కొనుగోలుదారులను ఆకర్షించింది. భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం మాత్రమే 80వేల కంటే ఎక్కువగా ఎక్వైరీస్ రాగా.. దాదాపు 30వేల వాహనాలను డెలివరీ చేసింది. ఇక హ్యూందాయ్ సైతం 11వేల యూనిట్లు విక్రయించింది. కంపెనీలు జీఎస్టీ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తుండడంతో వినియోగదారులు కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మారుతి, హ్యుందాయ్ తదితర అనేక కంపెనీలు జీఎస్టీ తగ్గింపునకు తోడు అదనంగా డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. మారుతి వాహనాలపై రూ.1.29లక్షల వరకు భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నది. మారుతి ఎస్-ప్రెస్సో కారు ధర రూ.1.29 లక్షలు తగ్గించి ప్రస్తుతం రూ.3.50 లక్షల ప్రారంభ ధరకు అమ్ముతున్నారు. మహీంద్రా బొలెరో, బొలెరో నియో రూ.2.56 లక్షల వరకు తగ్గాయి. టాటా పంచ్, కియా సైరోస్ కూడా రూ.1.6 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఈ పండుగ సీజన్ ఆటోమొబైల్ కంపెనీలకు కీలక సమయం. ఎందుకంటే ఇది వారి వార్షిక అమ్మకాలు ఈ సమయంలో గణనీయంగా ఉంటాయి. గత కొన్ని నెలలుగా భారత ప్రయాణీకుల వాహన పరిశ్రమ బలహీనమైన అమ్మకాలతో ఇబ్బంది పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. సంవత్సరం వారీగా వృద్ధి మొదట్లో 1-4శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే, జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈ వృద్ధి రేటు 5నుంచి7శాతానికి చేరుకుంటుందని అంచనా. ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ కూడా 2026కి భారతదేశంలో ప్రయాణీకుల వాహన పరిశ్రమకు దాని వృద్ధి అంచనాను 4.1శాతం నుంచి 8.5శాతానికి పెంచింది. ఆటోమొబైల్ రంగం త్వరలో మాంద్యం నుంచి బయటపడే అవకాశం ఉందని అంచనా వేసింది.