Maruti Baleno – WagonR | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మారుతి బాలెనో, మిడ్ లెవల్ హ్యాచ్ బ్యాక్ వ్యాగన్ఆర్ మోడల్ కార్లు 16 వేలకు పైగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిల్లో ఫాల్టీ ఫ్యుయల్ పంప్ మోటార్లో సాంకేతిక లోపం తలెత్తింది. 2019 జూన్ 30 నుంచి నవంబర్ ఒకటో తేదీ మధ్య తయారైన 11,851 బాలెనో, 4,190 వ్యాగన్ఆర్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
‘ఫ్యుయల్ పంప్ మోటార్లో లోపం తలెత్తడంతో అరుదుగా కారు ఇంజిన్ నిలిచిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్య వస్తుంది’ అని మారుతి సుజుకి ఓ ప్రకటనలో పేర్కొంది. ఆథరైజ్డ్ డీలర్ వర్క్‌షాప్‌ల ద్వారా కాంటాక్ట్ చేసిన కస్టమర్ల దెబ్బతిన్న కార్లలో సదరు ఫ్యుయల్ పంప్ మోటార్ రీప్లేస్ చేస్తామని, ఉచితంగా రీప్లేస్ చేస్తామని మారుతి తెలిపింది.
దేశీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- ఫిబ్రవరి మధ్య 1,80,018 యూనిట్ల బాలెనో, 1,83,810 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. మారుతి బాలెనో కారు ధర రూ.6.66 లక్షల నుంచి రూ.9.88 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతున్నది. వ్యాగన్ ఆర్ కారు రూ.5.54 లక్షల నుంచి రూ.7.37 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) లభిస్తుంది.