Credit Card Bills | క్రెడిట్ కార్డుల్ని సవ్యంగా వినియోగిస్తే వాటితో ఎన్నో లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితుల నిర్వహణలో వీటి పాత్ర ఎంతో ప్రభావవంతం. కానీ దురదృష్టవశాత్తూ చాలామంది ఈ క్రెడిట్ కార్డుల వాడకంతో మితిమీరిన ఖర్చుల వలయంలో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిల్లులను చెల్లించలేని దుస్థితికి చేరుకుంటున్నారు. అయితే భారమైన క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులకు కొన్ని మార్గాలున్నాయి. వాటిలో..
చాలా క్రెడిట్ కార్డు సంస్థలు బకాయిలను ఈఎంఐల్లోకి మార్చుకునే సౌకర్యం వినియోగదారులకు ఇస్తున్నాయి. నిజానికి మెజారిటీ బ్యాంకులు ఈ సదుపాయాన్ని ఉచితంగానే కార్డుదారులకు అందిస్తున్నాయి. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును సమకూర్చుకునే భారం తప్పుతుంది. అయితే క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐల్లోకి మార్చుకునే ముందు కనిపించని చార్జీలు ఏమైనా ఉన్నాయా?, ప్రాసెసింగ్ ఫీజులుంటాయా? అన్నది జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.
క్రెడిట్ కార్డు వినియోగదారులు తప్పక తమ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను తెలుసుకోవాలి. బ్యాంకులు క్రెడిట్-ఫ్రీ పీరియడ్‌ను కల్పిస్తాయి. ఇందులో బకాయిల చెల్లింపునకు 30 రోజుల స్టేట్మెంట్ సైకిల్, దానిపై 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటాయి. ప్రతి నెలా బిల్లింగ్ సైకిల్ ఏ తేదీన మొదలవుతుందో చూసుకోవాలి. ఆ తేదీ తర్వాత కొంటే మనకు పేమెంట్‌కు ఎక్కువ సమయం ఉంటుంది.
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ ఆగస్టు 4న ఉన్నది. ఆ బిల్లు స్టేట్మెంట్ జూలై 18న వచ్చింది. అయితే జూలై 19న మీరు మీ క్రెడిట్ కార్డు ద్వారా ఓ వస్తువును కొన్నారు. అప్పుడు అది తర్వాతి బిల్లు స్టేట్మెంట్లో ఉంటుంది. దాన్నిబట్టి సెప్టెంబర్ 4వరకు మీరు దాని చెల్లింపునకు వ్యవధి ఉంటుందన్నమాట. ఒకవేళ జూలై 17న కొంటే ఆగస్టు 4కల్లా చెల్లించాల్సిందే. రెండ్రోజులు ఆగి కొనడం వల్ల ఇంత లాభం ఉంటుంది. సమయం ఎక్కువగా ఉండటం వల్ల నగదు సర్దుబాటుకు వీలుంటుంది.
క్రెడిట్ కార్డు బకాయిలపై పడే వడ్డీరేటు కన్నా.. వ్యక్తిగత రుణాలపై పడే వడ్డీరేటు తక్కువ. కాబట్టి ఎక్కువగా ఉన్న క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించేందుకు పర్సనల్ లోన్ల సహాయం తీసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీరేటు ఇంకా తగ్గుతుంది. అలాగే మినిమం కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లిస్తే మంచిది. అధిక వడ్డీ బకాయిలను ముందుగా చెల్లించాలి. తక్కువ మొత్తాలను తీర్చడానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతకన్నా ముందు అనవసరపు కొనుగోళ్లను తగ్గిస్తే బిల్లుల భారం తగ్గుతుంది.