న్యూఢిల్లీ, ఆగస్టు 22: కూడు.. గూడు.. గుడ్డ.. ఆ తర్వాత ఈ దేశంలోని కోట్లాది ప్రజల కల ఆరోగ్య సంరక్షణే. ఇదే.. ఇప్పుడు భారతీయ వైద్య రంగాన్ని వేగంగా వృద్ధిపథంలో నడిపిస్తున్నది. ఇక ఆపత్కాలంలో వైద్యం చేయడమే కాదు.. అవసరమైతే ఆంత్రప్రెన్యూర్లుగానూ మారుతామని డాక్టర్లు నిరూపిస్తున్నారు. దీంతో హెల్త్‌కేర్ బిజినెస్ దూసుకుపోతున్నది. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి రావడం కూడా.. ప్రైవేట్ ఆస్పత్రుల విస్తరణకు దోహదం చేస్తున్నది. దేశంలో 60 కోట్లకుపైగా జనాభాకు ఆరోగ్య బీమా ఉన్నట్టు అంచనా.
మణిపాల్, అపోలో దగ్గర్నుంచి మ్యాక్స్ హెల్త్‌కేర్, ఫోర్టీస్ హెల్త్‌కేర్, మేదాంత, పరాస్ హెల్త్, యశోదా హాస్పిటల్స్ వరకు దేశంలోని అన్ని ప్రధాన దవాఖానల గ్రూపులు.. పడకలను పెంచుకుంటూ, కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తూపోతున్నాయి. ఈ క్రమంలోనే దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడమేగాక, స్టాక్ మార్కెట్ల నుంచీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తున్నాయి. పడకల సామర్థ్యం ప్రకారం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ అయిన మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్.. జూలైలో రూ.9,275 కోట్ల ఐపీవోను తెచ్చింది. దేశ, విదేశాల్లో దవాఖానల కొనుగోలుకు చేసిన అప్పులను తీర్చేందుకు ఈ నిధులను వినియోగిస్తామని మణిపాల్ చెప్తున్నది. అలాగే అపోలో హాస్పిటల్స్ వచ్చే ఐదేండ్లలో దాదాపు 4,400 బెడ్లను పెంచుకోవాలని చూస్తున్నది. మరోవైపు ఢిల్లీ, ముంబై, గువాహటి, వారణాసి నగరాల్లో విస్తరించి, 2,950 బెడ్లను పెంచుకోవాలని మేదాంత యోచిస్తున్నది. ఇదే క్రమంలో వచ్చే 3-4 ఏండ్లలో గురుగ్రామ్, లక్నో, ఢిల్లీ, పంజాబ్, భువనేశ్వర్ ప్రాజెక్టుల ద్వారా మ్యాక్స్ హెల్త్‌కేర్ తమ పడకల సామర్థ్యాన్ని 10వేలకుపైగా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇక గ్రేటర్ నోయిడాలోని యశోదా మెడిసిటీలో యశోదా గ్రూప్ రూ.2,400 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నది. ఫోర్టీస్, పారస్.. ఇలా అనేక ప్రముఖ గ్రూపులు దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికల్ని రచిస్తున్నాయి.
భారతీయ హాస్పిటల్ బూమ్ కేవలం పెట్టుబడుల ద్వారానే రాలేదు. దీని వెనుక దేశంలోని అతిపెద్ద హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూషన్ల పెద్దలున్నారు. డాక్టర్లుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఇప్పుడు విజయవంతమైన దవాఖానల నిర్వాహకులుగా పేరుగాంచారు. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి (అపోలో హాస్పిటల్స్), డాక్టర్ నరేశ్ ట్రెహాన్ (మేదాంత), డాక్టర్ దేవీ శెట్టి (నారాయణ హెల్త్).. ఇలా ఎందరో ఉన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ వరుసలో హైదరాబాద్ ఆధారిత, రెండు తెలుగు రాష్ర్టాలకు చెందినవారు ఒక అడుగు ముందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దేశంలోని ఫార్మా కంపెనీల్లో ఎక్కువగా ఇక్కడే ఉండటం కూడా కలిసొస్తున్న అంశంగా ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హాస్పిటల్స్ విస్తరణతో వైద్యులు, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్లు ఇతరత్రా మెడికల్ సిబ్బందికి ఉద్యోగావకాశాలూ పెరుగుతున్నాయని అంటున్నాయి.
2021-22 నుంచి ఇప్పటిదాకా ప్రైవేట్ ఈక్విటీలు, పబ్లిక్ మార్కెట్ల ద్వారా వివిధ ఆస్పత్రులు రూ.55,000-60,000 కోట్ల నిధులను సమీకరించినట్టు కేర్ రేటింగ్స్ అంచనా.
2030నాటికి అదనంగా మరో 38,000కుపైగా పడకల సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న ప్రధాన హాస్పిటల్ గ్రూపులు. ఇందుకు రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం.
యశోదా హాస్పిటల్స్ ఐపీవోకు సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్. ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.3,000-4,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా రావచ్చన్న అంచనాలు.
తెలుగు రాష్ర్టాలకు చెందిన అపోలో, యశోదా, కిమ్స్, కేర్, కామినేని, ఏఐజీ, రెయిన్బో హాస్పిటల్స్ గ్రూపులు.. దేశవ్యాప్తంగా, తొలుత దక్షిణాది రాష్ర్టాల్లో విస్తరణ దిశగా అడుగులు.
గడిచిన ఐదేండ్లలో తమ నెట్‌వర్క్‌లోకి 31 చిన్న ఆస్పత్రులను చేర్చుకున్న మణిపాల్ హెల్త్. అపోలో, కిమ్స్ తదితర సంస్థలూ ఇతర ఆస్పత్రులను హస్తగతం చేసుకోవడం, భాగస్వామ్యంగా చేర్చుకోవడం చేస్తున్నాయి.
టై-అప్ల ద్వారా కొత్త ప్రాంతాల్లోకి, నూతన వైద్య సేవల్లోకి వెళ్తున్న బడా కార్పొరేట్ ఆస్పత్రులు. సంయుక్తంగా దవాఖానలను నిర్వహిస్తూ లాభాల్లోకి.
2010లో రూ.12,546గా ఉన్న ప్రైవేట్ దవాఖానల సగటు ఇన్-పేషెంట్ ఖర్చు.. 2023లో రూ.42,600కు చేరిందని చెప్తున్న ఎన్ఎస్ఎస్వో గణాంకాలు.
దేశంలోని మెట్రో నగరాలు, ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విస్తరణపట్ల కూడా ఆసక్తి చూపుతున్న బడా హాస్పిటల్ గ్రూపులు.
వైద్య సేవలకే పరిమితం కాకుండా, క్యాన్సర్ వంటి మహమ్మారిపై పరిశోధనలకూ ఆయా దవాఖానలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ దిశగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.
టెమాసెక్ హోల్డింగ్స్, బ్లాక్‌స్టోన్, కేకేఆర్, టీపీజీ క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, గ్లోబల్ సావరిన్ వెల్త్ ఫండ్స్ 2021 నుంచి దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాయని అంచనా.
హాస్పిటల్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్న మదుపర్లు. ఆకర్షణీయంగా నమోదవుతున్న ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్లలోని దవాఖానల షేర్లకు ఆదరణను
తెచ్చిపెడుతున్నాయి.
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్
మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్
ఫోర్టీస్ హెల్త్‌కేర్ లిమిటెడ్
గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ (మేదాంత)
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)
రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్
నారాయణ హృదయాలయ లిమిటెడ్
జుపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్
ఆరోగ్య సంరక్షణ రంగంలో బలమైన పెట్టుబడి అవకాశాలున్నాయి. ఏకీకృతం దిశగా వెళ్తున్నది. మార్కెట్లో ప్రస్తుత తీరుతెన్నులను నిశితంగా గమనిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఆస్పత్రుల నిర్వహణనూ పరిశీలిస్తున్నాం.
– డాక్టర్ ఉపాసన అరోరా, యశోదా గ్రూప్ ఎండీ
భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగం కీలక దశలో ఉన్నదిప్పుడు. పెరుగుతున్న ఆదాయాలు, ఆరోగ్యంపట్ల అవగాహన, బీమా పరిధి, దీర్ఘకాలిక వ్యాధుల వ్యయ భారం.. వైద్య రంగం డిమాండ్, అంచనాలు అంతకంతకు మార్చేస్తున్నాయి.
– సునీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎండీ