హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ప్రముఖ బంగారం, వజ్రాభరణాల తయారీ సంస్థ మలబార్ జ్యుయెల్లరీ తెలంగాణ ప్లాంట్.. ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తిలోకి రానున్నది. రూ.750 కోట్ల పెట్టుబడితో మహేశ్వరంలో ఈ నగల తయారీ కేంద్రాన్ని మలబార్ ఏర్పాటు చేస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి దశలో ఇప్పటికే కంపెనీ రూ.183 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
ఈ క్రమంలోనే గురువారం మలబార్ వర్గాలు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. ప్లాంట్ నిర్మాణం తదితర వివరాలను తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మలబార్ సంస్థ మహేశ్వరంలో తెస్తున్న యూనిట్ దేశంలోనే అతిపెద్దదని చెప్పారు. డిసెంబర్‌కల్లా సిద్ధమవుతుందన్నారు.
ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంపై వచ్చే 20 ఏండ్లకు అవసరమైన ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని మంత్రి శ్రీధర్ బాబు బ్రిటీష్ హై కమిషన్, ఏర్నెస్ట్ అండ్ యంగ్(ఈ అండ్ వై) కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీలో బ్రిటిష్ హై కమిషన్, ఈ అండ్ వై సంస్థలు కీలక భాగస్వాములు కావాలని ఆయన కోరారు.