ముంబై, మే 28: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రికార్డు లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,192 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.245 కోట్లతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగినట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 28 శాతం అధికమై రూ.17,124 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.13,356 కోట్లుగా ఉన్నది. మరోవైపు 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.55,300 కోట్ల ఆదాయంపై రూ.4,935 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని గడించింది.
గత త్రైమాసికంలో యుటిలిటీ వాహనాలకు డిమాండ్ ఉండటం, ట్రాక్టర్ల విక్రయాలు 42 శాతం పెరగడంతో లాభాల్లో ఐదింతల వృద్ధికి దోహదం చేసిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అలాగే చివరి త్రైమాసికంలో ఎగుమతులు 77 శాతం చొప్పున అధికమవగా, 17,500 యూనిట్ల ట్రాక్టర్లు ఎగుమతి అయ్యాయి. గత కొన్ని త్రైమాసికాలుగా చిప్‌ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురొన్న సంస్థకు గత త్రైమాసికంలో ఊరట లభించింది. చిప్‌ల సరఫరా మెరుగుపడటంతో యుటిలిటీ వాహనాల డిమాండ్ అధికమడానికి పరోక్షంగా దోహదం చేశాయని మహీంద్రా ఎండీ, సీఈవో అనిశ్ షా తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.55 వేల కోట్ల ఆదాయం ఆర్జించడం ఇదే తొలిసారి.