హైదరాబాద్ : మిగతా రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కోరకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. కరోనాకు ముందు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12 శాతం నుంచి18 శాతం వరకు ఉండగా… ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గడంతో 10-12 శాతం మధ్య అందుబాటులో ఉన్నాయి. గృహరుణం , వాహన రుణం , గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు పర్సనల్ లోన్ కంటే కాస్త తక్కువగానే ఉంటుంది. మొదటి మూడు సెక్యూర్డ్ లోన్స్. కానీ పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ రుణం.
పలు బ్యాంకులు 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతోను పర్సనల్ లోన్ ఇస్తున్నాయి. ఇప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 6.5 శాతం నుంచి 8.5 శాతం వరకు ఉంది. కొన్ని బ్యాంకులు ఈ అన్-సెక్యూర్డ్ పర్సనల్ లోన్ కూడా దాదాపు హోమ్ లోన్ తో సమానమైన వడ్డీ రేటును కూడా అందించడం గమనార్హం. యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు పర్సనల్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు అందిస్తున్నాయి.
ప్రాసెసింగ్ ఫీజు రద్దు..
దీపావళి సమయంలో పలు బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపు ఆఫర్ను ప్రకటించాయి. దీపావళి దాటిన తర్వాత కూడా కొన్ని బ్యాంకులు ఈ ఆఫర్ కొనసాగిస్తున్నాయి. పండుగ సందర్భంగా తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు రద్దు లేదా తగ్గింపు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.
ఐదేండ్ల కాలపరిమితి కోసం రూ.5 లక్షల వరకు తీసుకునే పర్సనల్ లోన్ పైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.9 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. నెలవారీ ఈఎంఐ రూ.10,355 అవుతుంది. సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ ఇస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.
అత్యంత తక్కువ వడ్డీ కే…
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.9 శాతం వడ్డీ రేటుకే పర్సనల్ లోన్ ఇస్తుండగా, ఇండియన్ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకే పర్సనల్ లోన్ ఇవ్వడంలో రెండో స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 9.05 శాతానికే అందిస్తోంది. రూ.5 లక్షలు తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.10,391.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.45 శాతంగా ఉంది. ఈఎంఐ రూ.10.489 అవుతుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. అయిదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల రుణం తీసుకుంటే రూ.10,501 ఈఎంఐ అవుతుంది. ఐడీబీఐ బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. అయిదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల రుణం తీసుకుంటే రూ.10,501 ఈఎంఐ అవుతుంది.దేశంలోని ప్రధాన బ్యాంకులు పండుగ సమయంలో 9.6 శాతం తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ అందించాయి. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.10,525 అవుతుంది.