LIC Chairman | వచ్చే 14 ఏండ్లలో అంటే 2047 నాటికి భారత పౌరులందరికీ బీమా పాలసీలు అందుబాటులోకి తేవడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం గ్రామీణుల కోసం ప్రత్యేక పాలసీలు తెచ్చే అంశంపై యోచిస్తున్నామని తెలిపారు. బీమా రంగ విస్తరణ కోసం ఐఆర్డీఏఐ ‘బీమా విస్తార్’ అనే సమగ్ర పాలసీని ప్రతిపాదించిందని చెప్పారు. జీవితం, ఆరోగ్యం, ఆస్తి బీమాతో కూడిన పాలసీయే ‘బీమా విస్తార్’ అని చెప్పారు. ఈ ప్రతిపాదన తెచ్చినందుకు ఐఆర్డీఏఐకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ‘బీమా విస్తార్’ పాలసీల విక్రయానికి గ్రామ పంచాయతీ స్థాయిలో ‘బీమా వాహక్’లను నియమించాలని గత జూన్లో ఐఆర్డీఏఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. బీమా పాలసీల విక్రయానికి ‘కార్పొరేట్ బీమా వాహక్’లతోపాటు ‘వ్యక్తిగత బీమా వాహక్’లను నియమించాలని ఈ ముసాయిదా మార్గదర్శకాలు సిఫారసు చేశాయి.
మహిళల ఆధారిత పంపిణీ చానెల్ ద్వారా ‘బీమా వాహక్’లను నియమించనున్నట్లు సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తవుతుంది. నాటికల్లా దేశాన్ని డెవలప్డ్ దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా.. అంతర్జాతీయ స్థాయితో పోలిస్తే దేశీయంగా బీమా పాలసీల విక్రయం చాలా తక్కువగా ఉంది.