న్యూఢిల్లీ, జనవరి 11: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) దూసుకుపోతున్నది. ప్రైవేట్ బీమా సంస్థల నుంచి పోటీ తీవ్రతరమైనప్పటికీ అధిక వృద్ధిని సాధిస్తున్నది. 2024 సంవత్సరంలో నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ 14.64 శాతం వృద్ధిని సాధించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విషయాన్ని వెల్లడించింది. బీమా రంగ ఇండస్ట్రీ 14.41 శాతం వృద్ధిని సాధించగా, ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు 14.55 శాతం వృద్ధి కనబరిచాయి. గడిచిన 12 నెలల్లో ఎల్ఐసీ రూ.2,33, 073.36 కోట్ల ప్రీమియం వసూళ్లు జరపగా, క్రితం ఏడాదిలో రూ.2,03,303 కోట్లుగా ఉన్నాయి. మొత్తంమీద లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ రూ.4,02,773.18 కోట్ల మేర ప్రీమియం కలెక్షన్లు జరిపాయి. దీంట్లో ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు రూ.1,69,699.83 కోట్ల మేర ప్రీమియం వసూళ్లు చేశాయి. 2023లో వసూలు చేసిన రూ.1,48,323.21 కోట్లతో పోలిస్తే 14.41 శాతం అధికమని పేర్కొంది. దీంట్లో ఇండివిజ్యూవల్ ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ 4.92 శాతం వృద్ధిని సాధించింది. రూ.58, 486.69 కోట్ల నుంచి రూ.61,365.75 కోట్లకు పెరిగాయి. గడిచిన సంవత్సరంలో ఎల్ఐసీ 1.96 కోట్ల పాలసీలు, స్కీంలను జారీ చేసింది. అంతక్రితం ఏడాది విక్రయించిన 2.01 కోట్ల పాలసీలతో పోలిస్తే 2.72 శాతం తగ్గాయి.