Pension for Sr Citizens | వృద్ధుల కష్టనష్టాలను గుర్తించిన ప్రధాని నరేంద్రమోదీ.. వారి సంక్షేమానికి ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇది సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ కం పెన్షన్ స్కీం. ఇది వృద్ధులకు ఎంతో భద్రంగా ఉంటుంది. 60 ఏండ్ల వయస్సు దాటిన వారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో చేరడానికి గతేడాది మార్చి నెలాఖరు వరకే గడువు విధించిన కేంద్రం.. తదుపరి 2023 మార్చి వరకు పొడిగించింది. దీన్ని ఎల్ఐసీ నిర్వహిస్తోంది.
ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై 7.40 శాతం వడ్డీరేటు చెల్లించనున్నది. దీని గడువు పదేండ్లు. ఈ స్కీమ్‌లో చేరిన వారు నెలనెలా, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి పెన్షన్ పొందొచ్చు. మీరు ఎంచుకున్న ఆప్షన్‌కు అనుగుణంగా మీ ఖాతాలో పెన్షన్ జమ అవుతుంది.
వయ వందన యోజన స్కీమ్ కింద కనీస పెన్షన్‌గా రూ.1000, గరిష్ఠ పెన్షన్‌గా రూ.9,250 చెల్లిస్తారు. రూ.1000 పెన్షన్ కోసం రూ.1.62 లక్షలు మదుపు చేయాలి. రూ.9,250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గడువు కాలం ముగిసిన తర్వాత పాలసీదారుడికి మొత్తం పెట్టుబడి అందజేస్తారు.
ఒకవేళ పాలసీదారు మధ్యలోనే మరణిస్తే.. పెట్టుబడి మొత్తం నామినీకి చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న మూడేండ్ల తర్వాత 75 వరకు రుణం తీసుకోవచ్చు. గడువు పూర్తి కాకముందే.. పాలసీ వద్దనుకుంటే మదుపు చేసిన మొత్తంలో 98 శాతం మాత్రమే వెనుకకు ఇస్తారు.