LIC Premium Payment | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) దేశంలోనే అత్యధిక మంది ప్రజల నమ్మకాన్ని చూరగొన్న బీమా సంస్థ. ఇందులో సుమారు 25 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. ఎల్ఐసీ తన పాలసీదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అనునిత్యం నూతన పరిష్కార మార్గాలు చూపుతుంది. అందులో భాగంగా పాలసీదారులు తమ ప్రీమియం చెల్లింపులు ఈజీగా చేసేందుకు ఇప్పటికే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. కనుక పాలసీదారులు ఎల్ఐసీ ఆఫీసులకు వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రీమియం పే చేయొచ్చు. ఆన్లైన్లో ప్రీమియం చెల్లించే పాలసీదారులకు ఎల్ఐసీ వెబ్ సైట్, ఎల్ఐసీ యాప్ అనే రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో ప్రీమియం చెల్లింపులు ఎలా జరుగుతాయో ఓ లుక్కేద్దామా..
తొలుత www.licindia.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి ‘పే ప్రీమియం’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ లాగిన్ కాకుండా పే డైరెక్ట్, త్రూ కస్టమర్ పోర్టల్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
ఎల్ఐసీ పోర్టల్‌లో నమోదు కాకుండా ప్రీమియం పే చేయాలని భావించే వారికి ‘పే డైరెక్ట్’ ఆప్షన్ తెచ్చింది సంస్థ. ఇందులో అడ్వాన్స్ ప్రీమియం పేమెంట్, లోన్ రీ పేమెంట్, లోన్ వడ్డీ పేమెంట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. అడ్వాన్స్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే.. ప్రీమియం చెల్లింపు ప్రక్రియ పూర్తి వివరాలు పాప్ఆప్ మెనూ రూపంలో కనిపిస్తాయి. దీనికి సమ్మతి తెలిపాక ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
పాలసీ నంబర్, చెల్లించాల్సిన ప్రీమియంతోపాటు అడిగే డిటైల్స్ అన్నీ నమోదు చేయాలి. ఎటువంటి తప్పుల్లేకుండా టైం ముగియకముందే పేమెంట్స్ చేసేయాలి. లేకపోతే పేజీలో టైమ్ ఔట్ అనే మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ వస్తే మళ్లీ మొదటి నుంచి ప్రాసెస్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ అంశం పూర్తయిన తర్వాత ‘ఐ అగ్రీ’పై క్లిక్ చేసి, సబ్మిట్ చేయాలి. ఎల్ఐసీ రూల్స్ ప్రకారం పాలసీదారులే ఆన్ లైన్ పేమెంట్స్ స్వయంగా పూర్తి చేయాలి. థర్డ్ పార్టీ పేమెంట్స్‌కు ఎల్ఐసీ పర్మిషన్ ఇవ్వలేదు.
సబ్మిట్ తర్వాత మీ పాలసీ డిటైల్స్ అన్నీ కంప్యూటర్ లేదా ట్యాబ్ లేదా మొబైల్ ఫోన్ లో మీకు కనిపిస్తుంటాయి. ‘చెక్ అండ్ పే’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాతీ దశలో మీకు అనువైన పేమెంట్ ఆప్షన్ ఎంచుకుని చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసేయాలి.
ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ అయి నేరుగా మీరు మీ అకౌంట్ నుంచే నేరుగా ప్రీమియం పేమెంట్స్ చేసేయొచ్చు. ఒకవేళ ఇప్పటికీ రిజిస్టర్ కాకపోతే ‘సైన్‌ఆప్’పై క్లిక్ చేసి పాలసీ నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ కావచ్చు. అలా పేరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎల్ఐసీ వెబ్సైట్లోకి లాగిన్ అయి ప్రీమియం పే చేసేయొచ్చు. సరైన వివరాలు నమోదు చేసి మీ ఖాతాలో లాగిన్ కావాలి. లాగిన్ అయ్యాక ఆన్లైన్ పేమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. మిమ్మల్ని ప్రీమియం పేమెంట్ పోర్టల్‌లోకి తీసుకువెళుతుంది.
ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలను ఎంపిక చేసుకుని ‘చెక్ అండ్ పే’పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, ప్రీమియం డిటైల్స్ తదితర వివరాలు సరిగ్గా నమోదు చేశామా.. లేదా.. చెక్ చేసుకున్నాక మళ్లీ ‘చెక్ అండ్ పే’పై క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, యూపీఐ వంటి పేమెంట్ గేట్ వేల్లో ఒకదాన్ని ఎంచుకుని పేమెంట్ చేసేయవచ్చు.
యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఎల్ఐసీ కస్టమర్, ఎల్ఐసీ పే డైరెక్ట్, మై ఎల్ఐసీ యాప్స్ ద్వారా కూడా ప్రీమియం పే చేయొచ్చు. ఎల్ఐసీ కస్టమర్ యాప్ లో కూడా పే డైరెక్ట్, త్రూ కస్టమర్ ఆప్షన్లు ఉన్నాయి. రెండింటిలో మీకు అనువైన ఆప్షన్‌తో ప్రీమియం చెల్లింపులు పూర్తి చేయొచ్చు. ఎల్ఐసీ పే డైరెక్ట్ యాప్ లో ‘పే డైరెక్ట్’ తరహాలోనే రిజిస్టర్ కాకుండానే ప్రీమియం పే చేయొచ్చు. మై ఎల్ఐసీ యాప్ లోకి వెళితే.. మిగతా రెండు యాప్స్ లోకి రీ డైరెక్ట్ చేస్తుంది.
పాలసీదారులు నేరుగా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ (ఈసీఎస్) ద్వారా నేరుగా ప్రీమియం (ఆటో డెబిట్) చెల్లించేందుకు ఎల్ఐసీకి పర్మిషన్ ఇవ్వవచ్చు. ఇలా చేస్తే మీ ప్రమేయంతో సంబంధం లేకుండా నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచి నిర్దిష్ట తేదీ నాడే ప్రీమియం కట్ అవుతుంది. ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లి క్యాన్సిల్ చేసిన చెక్, పాలసీ వివరాలు ఇచ్చి.. ఈసీఎస్ ద్వారా పేమెంట్స్‌కు అనుమతి ఇవ్వాలి.
ఎల్ఐసీ ప్రీమియం ఆన్లైన్లో చెల్లించేవారు సరైన, వాడుతున్న మొబైల్ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఇవ్వాలి. అలా ఇస్తే ప్రీమియం పే చేసినట్లు మీ మెయిల్‌కు రశీదు వస్తుంది. ఆన్ లైన్ ద్వారా పాలసీదారులు మాత్రమే పే చేయాలి. థర్డ్ పార్టీ ద్వారా చెల్లింపులకు అనుమతించదు ఎల్ఐసీ.
మీ బ్యాంకు అకౌంట్ నుంచి ప్రీమియం మొత్తం ఖరారైనా.. మీకు ఎర్రర్ పేజీ వస్తే మూడు రోజుల వరకు వేచి ఉండాలి. అప్పటికి మీ మెయిల్ కు రశీదు వస్తుంది. ఒకవేళ అప్పటికీ రాకపోతే bo_eps1@India.comలోకి వెళ్లి కంప్లయింట్ చేయవచ్చు. ఎల్ఐసీ శాఖకు కూడా వెళ్లి కంప్లయింట్ చేయొచ్చు.
ప్రీమియం పే చేసినట్లు కన్ఫర్మేషన్ రాకపోతే.. మీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు కట్ అయిందా.. లేదా.. అనే అంశం చెక్ చేసుకోవాలి. ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయితే మళ్లీ పే చేయనక్కర్లేదు. మూడు రోజుల్లో రశీదు వస్తుంది. దేశీయ బ్యాంకులు జారీ చేసిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఎల్ఐసీ ప్రీమియం పే చేయాలి. అంతర్జాతీయ బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుంచి చెల్లించడానికి ఎల్ఐసీ అనుమతి ఇవ్వట్లేదు.