L&T Infotech | ఎల్ & టీ.. ఇన్ఫ్రా నుంచి టెక్నాలజీ రంగం వరకు సేవలందిస్తున్న సంస్థ. ఎల్&టీ అనుబంధ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ ఎల్& టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ).. హైదరాబాద్‌లో తన సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదారబాద్‌లో న్యూ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేసింది. 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్.. తన గ్లోబల్ క్లయింట్లకు డిజిటల్, డేటా, క్లౌడ్ సేవలందించడంపై దృష్టి సారిస్తుంది. మూడు వేల మందికి పైగా ఉద్యోగులు ఈ సెంటర్లో పని చేస్తుంటారు. సంస్థ అంతర్జాతీయ ఆపరేషన్ల నిర్వహణలో ఎల్ అండ్ టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సెంటర్నుఎల్టీఐ సీవోవో-ఎగ్జిక్యూటివ్బోర్డు సభ్యుడు నాచికెట్ దేశ్‌పాండేతో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రారంభించారు.
ఎల్&టీ ఇన్ఫోటెక్ డెలివరీ సెంటర్లో ఉద్యోగులందరి సేఫ్టీ, సెక్యూరిటీకి అత్యాధునిక వసతులు కల్పించారు. మాదాపూర్‌లోని హెటెక్ సిటీ మెయిన్‌రోడ్డుపై గల స్కైవ్యూ క్యాంపస్‌లో ఈ ఎల్&టీ ఇన్ఫోటెక్ డెలివరీ కేంద్రం ఏర్పాటైంది. దీనికి యూఎస్జీబీఎస్ ఎల్ఈఈడీ గోల్డ్ సర్టిఫికేషన్ లభించింది. టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్లకు,
ప్రతిభావంతులకు కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీరామారావు పంపిన సందేశంలో పేర్కొన్నారు. సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నందునే ఎల్&టీ ఇన్ఫోటెక్ వంటి గ్లోబల్ కార్పొరేషన్లు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని తెలిపారు. నూతన డెలివరీ కేంద్రం ప్రారంభించిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎల్&టీ ఇన్ఫోటెక్ సీవోవో-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు నాచికెట్ దేశ్‌పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం, విస్తారమైన ప్రతిభావంతుల నిధితో అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తమ సంస్థ పురోగతి ఆకాంక్షల్లో న్యూ సిటీ డెలివరీ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ రెడీనెస్‌పై రీసెర్చ్ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఎల్టీఐ ఎంవోయూ కుదుర్చుకున్నది.