న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ఎస్యూవీ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో కియా ఇండియా మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఎస్యూవీ సోరెంటో హైబ్రిడ్ మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు రూ.27.99 లక్షల నుంచి రూ.40.39 లక్షల మధ్యలో లభించనున్నదని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో గ్వాంగ్ గులీ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మాడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకొచ్చినట్టు చెప్పారు.
ఆటోమొబైల్ ఇండస్ట్రీ రూపాంతరం చెందుతున్నదని, హైబ్రిడ్ మాడళ్లకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే హైబ్రిడ్ టెక్నాలజీతో సెల్టోస్, సోనెట్ మాడళ్లను తీసుకొచ్చినట్టు చెప్పారు. కొత్తగా విడుదల చేసిన సోరెంటోను నెలకు 4 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రధానంగా భారత్‌లో సీఎన్జీ మాడళ్లకు ఎనలేని డిమాండ్ ఉందని, దీంతో ఈ నయా మాడల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించే అవకాశాలున్నాయన్నారు.