Kia Carens | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. తన ఎంవీపీ మోడల్ కార్లు కారెన్స్ (Carens) 30 వేలకు పైగా యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎర్రర్ సరి చేయడానికి వాటిని రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తయారైన 30,297 యూనిట్ల కారెన్స్ కార్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సాంకేతిక లోపాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా సరి చేస్తామని పేర్కొంది. ఈ సర్వీసు ఉచితంగా అందిస్తామని వెల్లడించింది.
కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతినిత్యం తనిఖీల ద్వారా, విడి భాగాల టెస్టింగ్ ద్వారా అవసరమైన కార్లను రీకాల్ చేస్తున్నట్లు కియా ఇండియా తెలిపింది. ఈ కార్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఇంతకుముందు గతేడాది అక్టోబర్‌లో ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడంతో కారెన్స్ కార్లను రీకాల్ చేసింది.
కియా కారెన్స్ కారు ధర రూ.10.45 లక్షల నుంచి రూ.18.95 లక్షల మధ్య పలుకుతుంది. ఈ కారు మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి ఎక్స్ఎల్6, టయోటా ఇన్నోవా క్రిస్టాలతో మార్కెట్లో పోటీ పడుతున్నది. కియా కారెన్స్ మూడు ఇంజిన్ ఆప్షన్లు – 1.5 లీటర్ల స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ (115 పీఎస్ / 144 ఎన్ఎం), 1.5 లీటర్ల స్మార్ట్ స్ట్రీం టీ -జీడీఐ పెట్రోల్ (160 పీఎస్ /253 ఎన్ఎం), 1.5 లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ (116 పీఎస్ /250 ఎన్ఎం)లలో అందుబాటులో ఉంది.