ముంబై, ఏప్రిల్ 28: ప్రధాన బ్యాంకులకు రిజర్వుబ్యాంక్ కీలక సూచన చేసింది. మార్కెట్లో నగదు కొరత తీవ్రతరమవుతున్న ప్రస్తుత తరుణంలో ఏటీఎంలలో రూ.100, రూ.200నోట్లను పంపిణీ చేసేలా చూడాలని సూచించింది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు దశలవారీగా ఈ ప్రతిపాదను అమలులోకి తేవాలని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో తరుచుగా వినియోగించే నోట్లను విరివిగా పెంపొందించే ప్రయత్నంలో భాగంగా అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఆపరేటర్లు తమ ఏటీఎంలలో రూ.100, రూ.200 డినామినేషన్ నోట్లను క్రమం తప్పకుండా పంపిణీ చేసేలా చూడాలని తన సర్క్యులర్లో పేర్కొంది. సెప్టెంబర్ 30, 2025 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 75 శాతం ఏటీఎంల్లో ఈ రెండు నోట్లలో కనీసం ఒక్క నోట్నైనా పంపిణీ చేయాలని పేర్కొంది.
నాలుగేండ్ల కనిష్ఠానికి పారిశ్రామికం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. తయారీ, గనులు, విద్యుత్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను పారిశ్రామిక రంగం నాలుగేండ్ల కనిష్ఠ స్థాయి 4 శాతానికి పడిపోయింది. 2023-24 ఏడాదిలో నమోదైన 5.9 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. 2020-21లో నమోదైన -8.4 శాతం తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం. ఆ తర్వాతి ఏడాది 2021-22లో 11.4 శాతం వృద్ధిని కనబరిచిన పారిశ్రామిక రంగం..ఆ మరుసటి ఏడాది 5.2 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంకా శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరోవైపు, మార్చి నెలకుగాను ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ 3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. గత నెలలో తయారీ రంగం 3 శాతానికి పరిమితమవగా, గనులు 1.3 శాతం నుంచి 0.4 శాతానికి పడిపోగా, విద్యుత్ రంగంలో వృద్ధి 6.3 శాతానికి పరిమితమైంది. అలాగే డాటా, ఇన్ఫ్రా, నిర్మాణ రంగాల్లో వృద్ధి 7.4 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గాయి. మరోవైపు, ఫిబ్రవరి 2025 గణాంకాలను కేంద్ర ప్రభుత్వం 2.7 శాతానికి తగ్గించింది. గతంలో 2.9 శాతంగా ఉన్నదని నివేదిక విడుదల చేసింది.