దద్దరిల్లిన జియో లిస్టింగ్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ
ఆరంభం నుంచి రికార్డుల మోత మోగిస్తున్న జియో.. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో ఎగబడి కొన్న మదుపర్లు.. ఎక్కడా తగ్గలేదు మరి. ఉదయం మొదలు చివరిదాకా ఇంచుమించుగా కొనుగోలుకే పెద్దపీట వేశారు.
- మొదటి రోజు 27 శాతం పెరిగిన షేర్ విలువ
- రూ.13.05 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్ వాల్యూ
- రెండో అత్యంత విలువైన భారతీయ సంస్థగా రికార్డు
ముంబై, అక్టోబర్ 28 : ఆరంభం నుంచి రికార్డుల మోత మోగిస్తున్న జియో.. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో ఎగబడి కొన్న మదుపర్లు.. ఎక్కడా తగ్గలేదు మరి. ఉదయం మొదలు చివరిదాకా ఇంచుమించుగా కొనుగోలుకే పెద్దపీట వేశారు. ఇక ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ రావడంతో అటు బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)లలో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ షేర్లు రూ.1,358 వద్ద నమోదయ్యాయి. గరిష్ఠ ఇష్యూ ధర రూ.1,119 కంటే ఇది 21.36 శాతం అధికం కావడం గమనార్హం. చివరికి బీఎస్ఈలో 26.66 శాతం వృద్ధితో రూ.1,417.35 వద్ద, ఎన్ఎస్ఈలో 26.67 శాతం వృద్ధితో రూ.1,417.50 దగ్గర ముగిశాయి. ఒకానొక దశలో 27.24 శాతం పుంజుకొని బీఎస్ఈలో రూ.1,423.80, ఎన్ఎస్ఈలో రూ.1,423.90 పలుకడం విశేషం.
టాప్-2 కంపెనీ..
ఊహించినట్టుగానే భారతీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ జియో బంపర్ లిస్టింగ్ చేసింది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ రూ.13,05, 241.98 కోట్లకు చేరింది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్-10 బీఎస్ఈ నమోదిత సంస్థల్లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ రెండో స్థానంలో నిలిచింది. రూ.15,67,744.61 కోట్లతో తొలి స్థానంలో జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఉన్నది. కాగా, ఈ పబ్లిక్ ఇష్యూతో దేశీయ టెలికాం రంగంలో వినియోగదారులపరంగానేగాక, స్టాక్ మార్కెట్లలో విలువపరంగానూ జియో అగ్రగామిగా అవతరించింది. ఎయిర్టెల్ రెండో స్థానానికి పరిమితమైంది.
ఉద్యోగులకు బొనాంజా
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో పుణ్యమాని ఈ ఏడాది రిలయన్స్ గ్రూప్‌లో దీపావళి పండుగ కాంతులు ముందే విరజిమ్మాయి. జియో పబ్లిక్ ఇష్యూకు మదుపర్లు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో బుధవారం రిలయన్స్ కార్పొరేట్ పార్క్ వద్ద తమ వేలాది ఉద్యోగులకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మెగా పార్టీనిచ్చారు. అంతేగాక ముందస్తు వేతనాలు, బోనస్ బొనాంజాలను ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను 75 శాతం మంది ఉద్యోగులకు వార్షిక నగదు బోనస్ లేదా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు లభించడం విశేషం. ప్రతి సంవత్సరంతో పోల్చితే ఈసారి కొన్ని నెలల ముందే అందాయి. ఇప్పటికే ఈ నెల జీతాలు అక్టోబర్ 15నే ఇచ్చారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రావడంతో పార్క్ కోలాహలంగా మారిపోయింది. నృత్యాలతో అంతా సందడి చేశారు. జియో లిస్టింగ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక జియో షేర్ల లిస్టింగ్ కార్యక్రమం నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో అట్టహాసంగా జరిగింది. రిలయన్స్ జియో చైర్మన్, జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ, ఆయన సోదరి ఇషా, సోదరుడు అనంత్లతోపాటు వారి పిల్లలు, ముకేశ్ అంబానీ దంపతులు, తల్లి కోకిలాబెన్, అల్లుడు, కోడలు పాల్గొన్నారు.
ముకేశ్ భావోద్వేగం
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్ జరుగుతున్న సందర్భంగా వేదికపై తన తర్వాత తరమైన కూతురు, కుమారులను చూసి ముకేశ్ అంబానీ మురిసిపోయారు. ముకేశ్ పడ్డ కష్టం, ఆయన చేసిన త్యాగాల గురించి వారు చెప్పడం విని కంటతడి పెట్టారు. పదేపదే కండ్లు తుడుచుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా ముకేశ్ దంపతులు, వారి సంతానం రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ (ముకేశ్ తండ్రి)కి నివాళులర్పించారు.
టాటాలను వెనక్కి నెట్టి..
ఈక్విటీల్లోకి జియో రాకతో రిలయన్స్ గ్రూప్ మరో రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా భారతీయ స్టాక్ మార్కెట్లలో విలువపరంగా టాటా గ్రూప్ టాప్‌లో ఉన్నది. కానీ ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ ఆ ఘనతను దక్కించుకున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రిలయన్స్ గ్రూప్ నుంచి ఆర్ఐఎల్, జియో ప్లాట్‌ఫామ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెట్వర్క్18 మీడియా, జస్ట్ డయల్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యువబుల్ ఎనర్జీ, హాథ్‌వే కేబుల్-డాటాకామ్, డీఈఎన్ నెట్వర్క్స్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, జీటీపీఎల్ హాథ్‌వే, ఇన్ఫోమీడియా ప్రెస్ కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి.
- రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 10కిపైగా సంస్థలు మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. వీటన్నింటి విలువ బీఎస్ఈ వివరాల ప్రకారం ఇంచుమించుగా రూ.30.25 లక్షల కోట్లుగా ఉన్నది.
- గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, కొత్త సంస్థ జియోల వాటానే దాదాపు రూ.28.73 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.
- మిగతా సంస్థలన్నింటి విలువ సుమారు రూ.1.52 లక్షల కోట్లు. దీంట్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విలువ రూ.1.35 లక్షల కోట్లు.
- రూ.25.28 లక్షల కోట్లుగానే టాటా గ్రూప్ వాల్యూ.
- ప్రపంచవ్యాప్తంగా చూసినైట్టెతే రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ (318 బిలియన్ డాలర్లు).
- హోమ్ డిపో (317.76 బిలియన్ డాలర్లు), ఎస్ఏపీ (274.11 బిలియన్ డాలర్లు), నెట్‌ఫ్లిక్స్ (256.73 బిలియన్ డాలర్లు), టొయోట (231.41 బిలియన్ డాలర్లు) సంస్థల కంటే రిలయన్స్‌దే ఎక్కువ.
- 5.26 ట్రిలియన్ డాలర్లతో ఎన్విదియా మార్కెట్ విలువలో అగ్రస్థానంలో ఉన్నది. 5.07 ట్రిలియన్ డాలర్లతో దాని సమీపాన రెండో నంలో యాపిల్ ఉన్నది.
ఇక్కడితో అయిపోలేదు. ఇది ప్రారంభం మాత్రమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాదిరిగానే జియో షేర్లూ మదుపర్లకు గొప్ప లాభాలను అందిస్తాయి. స్పేస్ కనెక్టివీటీని కూడా చేరుతాం. ఒకరోజు తప్పక ప్రపంచం గర్వించదగ్గ గొప్ప టెక్నాలజీ సంస్థల్లో ఒకటిగా జియో ఎదుగుతుంది.
-ఆకాశ్ అంబానీ, జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ
జియో అభివృద్ధిలో ఆకాశ్ పాత్ర గొప్పది. గడిచిన 13 ఏండ్లలో అర్ధరాత్రి దాటిన తర్వాతే తను ఇంటికి వచ్చినట్టు నాకు గుర్తు. ఒక్కరోజు ముందు వచ్చినట్టు కూడా నాకు గుర్తులేదు.
-ఇషా అంబానీ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ
జియో విజన్‌లో ఇషా, ఆకాశ్‌ల కష్టం అంతా ఇంతా కాదు. ఇషా విత్తనాన్ని నాటితే, ఆకాశ్ దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచాడు. ఈ కంపెనీ దేశ ప్రజల భాగస్వామ్యంతోనే నిర్మితమైంది.
-అనంత్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈడీ

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

