న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ప్లస్ టెక్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అపర కుబేరుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. మంగళవారం అమెజాన్ షేర్లు 4.7 శాతం పైపైకి దూసుకెళ్లడంతో జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద 211 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. దీనికి ఓ కారణం ఉంది.
మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. ఈ వార్త వెలుగు చూడటంతోనే అమెజాన్ షేర్లకు రెక్కలొచ్చాయి. ఫలితంగా జెఫ్ బెజోస్ వ్యక్తిగత నికర సంపద 8.4 బిలియన్ల డాలర్లు పెరిగిందని బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు 2019లో అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్‌ను అప్పగించారు. ట్రంప్ జోక్యంతోనే ఈ కాంట్రాక్ట్.. మైక్రోసాఫ్ట్‌కు దక్కిందని అమెజాన్ ఆరోపించింది. దీంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మైక్రోసాఫ్ట్, అమెజాన్ మధ్య విభేదాలకు దారి తీసింది.
మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్‌ను పెంటగాన్ అప్పగించడానికి వ్యతిరేకంగా అమెజాన్.. ఫెడరల్ కోర్టు తలుపు తట్టింది. ఈ నేపథ్యంలో అమెజాన్ పిటిషన్‌ను ఫెడరల్ కోర్టు కొట్టేయకపోతే.. మైక్రోసాఫ్ట్‌తో కాంట్రాక్ట్ రద్దు చేస్తామని ఈ ఏడాది మొదట్లోనే పెంటగాన్ ప్రకటించింది.
అమెజాన్ పిటిషన్‌ను కొట్టేయాలని మైక్రోసాఫ్ట్ చేసిన విజ్ఞప్తిని ఫెడరల్ కోర్టు తిరస్కరించింది. దీంతో ముందుగా ప్రకటించినట్లే పెంటగాన్.. మైక్రోసాఫ్ట్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది.
తాజాగా మైక్రోసాఫ్ట్, అమెజాన్లతో పెంటగాన్ ఈ ఒప్పందం ఖరారు చేసుకోవచ్చునని తెలుస్తున్నది. ఈ కాంట్రాక్ట్ విలువ 10 బిలియన్ల డాలర్లు.
ఇక ప్రపంచ కుబేరుల కిరీటం కోసం జెఫ్ బెజోస్‌తో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ జనవరిలో స్వల్ప కాలం పోటీ పడ్డారు. 210 బిలియన్ల డాలర్ల నికర సంపదతో జనవరిలో కొన్ని రోజులు టాప్‌లో ఉన్నారు.
అమెజాన్ షేర్లు 20 శాతం దూసుకెళ్లడంతో మార్చి మధ్య నుంచి తిరిగి గ్లోబల్ టాప్ బిలియనీర్‌గా జెఫ్ బెజోస్ నిలిచారు. ఈ వారంలో అమెజాన్ సీఈవోగా వైదొలగనున్న జెఫ్ బెజోస్ సంస్థలో 11 శాతం వాటాలు కలిగి ఉన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందిస్తారు.
జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ ప్రపంచ కుబేరుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ఆమె నికర సంపద 2.9 బిలియన్ల డాలర్లకు పెరిగింది.
తాజాగా మంగళవారం టెస్లా షేర్లు పడిపోవడంతో ఎలన్‌మస్క్ నికర సంపద 180.5 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్ లగర్జీ గూడ్స్ సంస్థ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ 168.5 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
హైదరాబాద్ రియల్టీలోకి వారెన్ బఫెట్
అక్కడ… సగానికి సగం తగ్గిన ఈ-వెహికల్స్ ధరలు.. ఎందుకంటే..?
మలబార్ గోల్డ్‌లో 5వేల ఉద్యోగాలు