Jack Dorsey | సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను కొనేస్తానంటూ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ చేసిన ఆఫర్‌పై ఆ మైక్రో బ్లాగింగ్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ స్పందించారు. ఎలన్‌మస్క్ చేసిన ప్రతిపాదనతో ట్విట్టర్ బోర్డు ఇరకాటంలో చిక్కుకుంది. ట్విట్టర్‌ను ఇటువంటి ప్రతిపాదనలు నిరంతరం దెబ్బ తీస్తాయని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డోర్సీ చెప్పారు. ట్విట్టర్‌కు సరైన భాగస్వామ్యం లేని బోర్డు వల్ల బిలియన్ల డాలర్లు ఆవిరై పోతాయని వెంచర్ క్యాపిటలిస్ట్ గేరీటాన్ చేసిన పోస్ట్‌తో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
గతేడాది ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్ బోర్డు నియమించింది. ట్విట్టర్లో 2.2 శాతం వాటా మాత్రమే గల జాక్ డోర్సీ వచ్చే నెల వరకు మాత్రమే సంస్థ డైరెక్టర్‌గా ఉంటారని సమాచారం. బోర్డు నుంచి జాక్ డోర్సీ వైదొలిగితే.. ట్విట్టర్ బోర్డుకు ఎటువంటి వాటా ఉండదని ఇటీవల టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ వ్యాఖ్యానించాడు.
తాజాగా ట్విట్టర్‌ను 43 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేస్తానని సంస్థ యాజమాన్యానికి ఎలన్‌మస్క్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు ట్విట్టర్లో 9.2 శాతం వాటాలు ఉన్నాయి. అంతేకాదు అతిపెద్ద వాటాదారుగా కూడా నిలుస్తారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు చేశారు.
ఎలన్‌మస్క్ ప్రతిపాదనను ట్విట్టర్ బోర్డు తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఎలన్‌మస్క్.. రూట్ మార్చి.. వాటాదారుల వద్ద నుంచి ప్రీమియం ధరకే అత్యధిక వాటాలు కొనుగోలు చేసే ప్రణాళిక రూపొందించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే ట్విట్టర్‌ను బలవంతంగానైనా తన ఆధీనంలోకి తీసుకోవాలని ఎలన్‌మస్క్ యోచిస్తున్నాడని వార్తలొచ్చాయి.