ఐటీ రంగానికి డిజిటైజేషన్ జోష్
ఈ ఆర్థిక సంవత్సరం రెవిన్యూ 15.5% వృద్ధి
అంచనా వేసిన నాస్కామ్
ముంబై, ఫిబ్రవరి 15: దేశీయ ఐటీ రంగం ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో గడిచిన దశాబ్దానికిపైగా కాలంలోనే ఎన్నడూలేనంత వేగంగా వృద్ధి చెందవచ్చని పరిశ్రమ సంఘం నాస్కామ్ అంచనా వేసింది. 15.5 శాతం వృద్ధితో 227 బిలియన్ డాలర్ల (రూ.17.10 లక్షల కోట్లు)కు ఐటీ రంగ ఆదాయం చేరవచ్చని పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) భారత ఐటీ పరిశ్రమ ఆదాయ వృద్ధిరేటు 2.3 శాతంగానే ఉన్నది. అయితే కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు డిజిటైజేషన్ బాట పట్టడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ సంస్థల రెవిన్యూ భారీగా పెరగనుందని నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్జానీ ఘోష్ అన్నారు. మంగళవారం ఇక్కడ తమ వ్యూహాత్మక సమీక్షపై ఆమె మీడియాతో మాట్లాడారు. 2019-20తో పోల్చితే 2020-21లో రెవిన్యూ గ్రోత్ రెట్టింపైందని, ఈ 2021-22లో ఎన్నో రెట్లు పెరిగే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయన్నారు. గ్లోబల్ ఐటీ ఖర్చులు 9 శాతం ఎగిసి 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరాయన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ ఐటీ రంగ సంస్థల ఆదాయం తొలిసారిగా 200 బిలియన్ డాలర్లను దాటే అవకాశాలున్నాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే జరిగితే కరోనా ప్రభావం నుంచి బయటపడ్డామనుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, 2026 నాటికి దేశీయ ఐటీ సంస్థల ఆదాయాన్ని 350 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడానికి 30 ఏండ్లు పట్టిందని గుర్తుచేశారు.
వేధిస్తున్న ఉద్యోగుల వలసలు
దేశీయ ఐటీ రంగాన్ని ఉద్యోగుల వలసలు బాధిస్తున్నాయని, బహుశా ఇది గరిష్ఠ స్థాయికి చేరిందనిపిస్తున్నదని నాస్కామ్ వైస్ చైర్మన్ కృష్ణన్ రామానుజం అన్నారు. గతేడాది అక్టోబర్-డిసెంబర్‌కుగాను ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో టాప్-10 ఐటీ కంపెనీల సమాచారాన్ని చూస్తే ఉద్యోగుల వలసలు తగ్గినట్టేమీ కనిపించడం లేదన్నారు. గతకొద్ది త్రైమాసికాల్లో చాలా సంస్థలు 20 శాతానికిపైగా ఉద్యోగ వలసల్ని ప్రకటించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కరోనా నేపథ్యంలో పెరిగిన డిజిటైజేషన్‌తో నైపుణ్యం, ప్రతిభగల ఉద్యోగులకు డిమాండ్ పెరిగిందని, ఈ పరిణామం కూడా వలసలకు దారితీస్తున్నదన్నారు. నిజానికి అంచనా కంటే ఎక్కువ స్థాయిలో ఉద్యోగులను ఐటీ కంపెనీలు నియమించుకొంటున్నాయని, ప్రతిభావంతులను చేజార్చుకోకుండా బోనస్‌లు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులను కూడా కల్పిస్తున్నాయని చెప్పారు. దీనివల్ల సంస్థ లాభాలు తగ్గుతున్నాయని గుర్తుచేశారు. కాగా, దేశీయ ఐటీ రంగంలో 50 లక్షలకుపైగానే ఉద్యోగులున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
బ్రాడ్‌బ్యాండ్, విద్యుత్తు అవసరం
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం.. చిన్న నగరాలకూ విస్తరించాలంటే నిరంతర బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం, విద్యుత్తు సౌకర్యం అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ఐటీ పరిశ్రమ స్పష్టం చేసింది. మౌలిక వసతులతోపాటు నైపుణ్యం, ప్రతిభావంతుల అవసరం కూడా ఉంటుందని చెప్పింది. చిన్నచిన్న నగరాలు, పట్టణాలకూ ఐటీ సంస్థలు విస్తరించాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో నాస్కామ్ పైవిధంగా స్పందించింది. కాగా, ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పనిచేసేందుకు ఐటీ ఉద్యోగులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారని, అయితే సరైన వసతులుంటే ఈ వలసల్ని తగ్గించవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. ఐటీ కంపెనీలు సైతం ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కోయంబత్తూర్, అహ్మదాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై దృష్టి పెట్టాలని సూచించింది.
ఈ ఆర్థిక సంవత్సరం 178 బిలియన్ డాలర్లకు ఐటీ ఎగుమతుల ఆదాయం చేరొచ్చు.
దేశీయ మార్కెట్ 10 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లను తాకొచ్చు.
79 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ సంస్థల ఆదాయం.
ఆదాయపరంగా నవతరం డిజిటల్ సర్వీసుల్లో 25 శాతం వృద్ధి.