Personal Finance | ఉద్యోగం ఇండియాలో చేయాలా? బయటి దేశంలో చేయాలా?.. అనే విషయమై చాలా చర్చలే జరుగుతుంటాయి. అయితే అవన్నీ ఒక పట్టాన ఒడిసే ముచ్చట్లు కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరు పడితే వారు అంత సులువుగా నిర్ధారించి చెప్పే విషయమూ కాదిది! ఇంకో నవ్వొచ్చే విషయం ఏమిటంటే చాలామంది తమకు ఏమాత్రం అనుభవం లేకున్నా ఏవేవో లెక్కలేసేస్తుంటారు. ఏదేదో చెప్పేస్తుంటారు. ఉద్యోగం ఎక్కడైతే బాగుంటుందనేది నిర్ణయించాల్సింది ఎవరు? అని ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించినట్టయితే సరైన సమాధానం దొరుకుతుంది.
సరైన వయసు, సరైన సమయంలో విమానం ఎక్కితేనే సక్సెస్ సాధ్యమవుతుంది. ఇరవై ఐదేండ్ల వయసులో ఉన్నప్పుడు విదేశీ ఉద్యోగం మొదలుపెడితే నలభై ఏండ్లు నిండేనాటికి అనుకున్నంత డబ్బుసంపాదించుకోవచ్చు. బయటి దేశాల్లో సంపాదిస్తున్నవారు త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. వారి లైఫ్‌ైస్టెల్ బాగుంటున్నది.
రాయేదో రత్నమేదో అనుభవజ్ఞుల కన్నా మిన్నగా ఇతరులు చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా చెప్పినా.. వారి మాటల్లో నిజమూ.. ఆ మాటలు నమ్మేవాళ్ల శాతమూ తక్కువే! మొత్తంగా అనుభవపూర్వకంగా చెప్పేవారి మాటకే ఎక్కువ విలువ. ఇక ఉద్యోగం ఎక్కడ చేయాలనే విషయంలో ఎన్ని అభిప్రాయాలున్నా.. ఆర్థికంగా ఎవరు ఉన్నతి సాధిస్తున్నారనేది గ్రహిస్తేగానీ ఉద్యోగం ఎక్కడ బాగుంటుంది అనేది ఎవరికీ అర్థం కాదనే చెప్పాలి. భారత్‌లో, విదేశాల్లో.. రెండు చోట్లా ఉద్యోగం చేసినవాళ్లు మాత్రమే ఈ విషయం గురించి పరిపూర్ణంగా విశ్లేషించగలుగుతారు.
ఇండియాలో కన్నా బయట దేశంలో జాబ్ చేసినవారు ఆర్థికంగా బాగున్నారనేది అంగీకరించాల్సిన మాట. కానీ ఈ విషయంలో చాలామంది వాదించేది ఏమిటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను, పన్నులను దృష్టిలో పెట్టుకుంటే అక్కడా, ఇక్కడా మిగులుబాటయ్యేదంతా గంతేనని! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇండియాలో కన్నా మిగతా ఏ దేశంలో, ఏ స్థాయి ఉద్యోగం చేసినవారైనా ఆర్థికంగా, కెరీర్ పరంగా ముందంజలో ఉన్నారు. ఇందుకు కారణం ఏమిటి? ఇందులో ఉన్న మతలబు ఏమిటి?
దేశవ్యాప్తంగా కొన్ని రాష్ర్టాల్లోని ప్రజల జీవన విధానాన్ని, కుటుంబాల ఆర్థికాభివృద్ధి తీరును పరిశీలిస్తే కచ్చితంగా విదేశీ ఉద్యోగానికే ఓటేయక మానరు. అంతదాకా ఎందుకు? తెలంగాణలోని కొన్ని పల్లెల జీవన విధానాన్ని పరిశీలించిన వారి అభిప్రాయాన్ని, ఫారిన్, గల్ఫ్ వంటి విదేశాల్లో ఏదో ఒక ఉద్యోగం చేసి వచ్చినవారి జీవితాలను దగ్గర నుంచి చూసినవారిని ఓ సారి పలుకరించినట్టయితే అసలు విషయం తెలుస్తుంది. ఇండియాలో 30 లక్షలు సంపాదించినా.. అమెరికాలో కోటి రూపాయల వేతనం వచ్చినా.. అంతా సరిసమానమే, అంతా ఒక్కటే అంటారు చాలామంది. ఇది వాస్తవమే. అక్కడ టాక్స్‌లు, లివింగ్ కాస్ట్ ఎక్కువ. అందుకే అక్కడ కోటి రూపాయలు ఆర్జించే వ్యక్తికి ఎంత మిగులుతున్నదో.. ఇక్కడ 30 లక్షలు సంపాదించినవారికి అంతే మిగులుతుంది, కాదనలేం!
జమీన్ ఆస్మాన్ ఫరఖ్
కానీ, ఇది చాలా తప్పుడు పోలిక. పోల్చే తీరులో లోపం ఉందన్న విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇండియాలో రూ.30 లక్షల వేతనం ఎంతమంది తీసుకుంటున్నారు? అతి కొద్దిమందికి మాత్రమే ఇంత పెద్దమొత్తంలో జీతాలు ఉంటున్నాయంటే కాదంటారా?! ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అమెరికా ఉద్యోగాలను ఉదాహరణగా తీసుకుందాం. అక్కడ ఎంఎస్ చేసిన ప్రతి ఫ్రెషర్కీ రూ.కోటి ప్యాకేజ్ వస్తుంది.
అంటే 1 లక్షా 25 వేల డాలర్లు ప్రతి సంవత్సరానికి వచ్చే వేతనం అన్నమాట! ఇప్పుడు చెప్పండి కోటి రూపాయల స్టార్టింగ్ ప్యాకేజ్ ఎక్కడ? ఎన్నో డక్కామొక్కీలు తిని, ఎన్నో ఏండ్ల అనుభవాన్నంతా లెక్కగట్టి ఇచ్చే 30 లక్షలు ప్యాకేజ్ ఎక్కడ. ఇంకా చెప్పాలంటే.. ఇక్కడ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదివినవారికో, పది పదిహేనేండ్ల సీనియారిటీ ఉన్నవారికో ఇంత మొత్తం జీతాలు పొందే అవకాశం దక్కుతుందే కానీ ఇదే విద్యాసంవత్సరమే డిగ్రీ పట్టా పుచ్చుకొని మార్కెట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ సాధ్యపడదన్నది గ్రహించాలి.
ఇద్దరూ ఉద్యోగులైతే భారతీయ కరెన్సీలో నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తున్న భార్యాభర్తలను చాలామందిని చూస్తున్నాం కదా! అలా అమెరికాలో 15 ఏండ్లపాటు ఉండి మంచి అనుభవం, బ్యాంక్ బ్యాలెన్స్‌తో సమాజంలో స్థితిమంతులుగా పేరు, కీర్తి పొందుతున్న కుటుంబాలకూ కొదువ లేదు ఆలూమగలిద్దరూ సంపాదిస్తుంటే ఒకరి ఆదాయం ఖర్చులకు పోను, మరొకరి వేతనాన్ని దాస్తున్నారు. వివిధ రంగాల్లో సర్వెంట్లుగా, డ్రైవర్స్‌గా, చిన్నచిన్ని ఉద్యోగాలు చేసేవారు ఎవరినైనా కదపండి.. ఇక్కడి ఆదాయానికీ, అక్కడి ఆదాయానికీ.. జమీన్ ఆస్మాన్ ఫరఖ్ ఉందని చెప్పకమానరు.
చిన్నవయసులోనే సంపాదన
ఓ పుష్కర కాలం క్రితం ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లినవారు, అక్కడే ఉద్యోగాల్లో చేరడం ద్వారా గ్రీన్‌కార్డులు, సిటిజెన్షిప్లు వచ్చాయి. వాళ్లలో చాలామంది పది పన్నెండేండ్లు అక్కడ ఉద్యోగం చేసి ఇండియా వచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఓవర్సిస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియాగా చెలామణి అవుతూ స్థానికంగానే ఎంచక్కా యూఎస్ కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. ఇక్కడ రెండేండ్లు కష్టపడ్డా సంపాదించలేని ఆదాయం అక్కడ నాలుగు నెలల కాలంలో కూడబెడుతున్నారు. నూటికి ఐదు శాతం ఫెయిల్యూర్స్ ఉంటాయి, కాదనలేం. కానీ 95 శాతం మంది ఇండియాలో కన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. బయటి దేశాల్లో పదేండ్ల కష్టం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నూటికి తొంభై శాతం కుటుంబాలు సెటిల్ అవుతున్నాయి. అదే ఇక్కడ.. 10 శాతం కూడా సెటిల్ అవడం గగనంగా ఉంది.
విదేశాలకు వెళ్లి పనిచేసేవాళ్లు స్కిల్డ్ లేబర్ కానీ, ఐటీ ఉద్యోగి కానీ పదేండ్లలోనే ఇండియాలో రిటైర్మెంట్కు సరిపడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్క యూఎస్ అనే కాదు ఆఫ్రికా దేశాల్లోనూ ఎక్కువమొత్తంలో సంపాదిస్తున్నవారు ఉన్నారు. మన దేశంలో కనీసం పదోతరగతి గట్టెక్కకుండా వెళ్లి నెలకు లక్ష సంపాదిస్తున్నవారిని సింగపూర్ వీధుల్లో చాలామందిని చూడొచ్చు. అలా వాళ్లు తమ కుటుంబాలను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.. తద్వారా ఒక తరాన్ని మార్చగలుగుతున్నారు. అర్హత, ఓపిక, కోరిక ఉంటే మాత్రం ఓ పదేండ్లు విదేశీ కరెన్సీ వెంట పరుగులు పెట్టి, స్వదేశంలో కుటుంబ స్థితిగతులను మార్చుకోవడం కన్నా మంచి మార్గం లేదు.
ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in