Hormuz Strait | అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయకుండా ఆపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చైనాను కోరారు. అయితే, భారత్‌లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది. అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది.
రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని జాతీయ భద్రతా అధ్యయనాల ప్రత్యేక కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహెరా మాట్లాడుతూ.. ఈ ఇరుకైన మార్గాన్ని మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, భారతదేశ ఇంధన భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. భౌగోళిక రాజకీయ సంక్షోభానికి దారితీసే ఈ ముఖ్యమైన షిప్పింగ్ మార్గంలో ఏదైనా అంతరాయం ఇరాక్, కొంతవరకు సౌదీ అరేబియా, భారతదేశం ముడి చమురు దిగుమతులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత నావికాదళ మాజీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ (రిటైర్డ్), హార్ముజ్ జలసంధిని మూసివేస్తామన్న హెచ్చరికలు ఇరాన్ ప్రపంచ చమురు వాణిజ్యానికి గణనీయమైన అంతరాయం కలిగిస్తుందని అన్నారు. షిప్పింగ్‌లో ఏదైనా అంతరాయం బీమా ప్రీమియంలపై ప్రభావం చూపుతుందని, చమురు రవాణా మరింత ఖరీదవుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా చమురు ధరలు ఇప్పటికే పెరిగే అవకాశం ఉందని శర్మ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే.. ధరలు బ్యారెల్‌కు 80-90 నుంచి వంద బ్యారెల్‌కు వంద డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. ప్రాంతీయ దేశాల కరెన్సీ అస్థిరత.. పెట్టుబడిదారులు ఇతర స్థిరమైన మార్కెట్ల వైపు మొగ్గు చూపవచ్చని.. ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని కూడా ఆయన అన్నారు.
హర్మూజ్ మార్గాన్ని మూసివేస్తే ఇరాన్ చాలా నష్టపోతుందని యూఎస్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. ఆసియాకు వెళ్లే చమురులో 44 శాతం ఈ మార్గం గుండానే వెళుతుందని ఆయన అన్నారు. ఇందులో ఎక్కువ భాగం చైనాకే వెళుతుందని ఆయన అన్నారు. ఇరాన్ హర్మూజ్ మార్గాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా ప్రతిస్పందన ఇస్తుందని అమెరికన్ ఉగ్రవాద ఆర్థిక విశ్లేషకుడు జోనాథన్ స్కాంజర్ అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి మద్దతు ఇస్తాయని.. ఇరాన్ చర్య ఆత్మహత్యా సదృశ్యమేనని పేర్కొంటున్నారు.
యుద్ధం తీవ్రతరం కావడం ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారతదేశం వాణిజ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశం వారికి 8.6 బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తుంది. 33.1 బిలియన్లు డాలర్లు దిగుమతి చేస్తుంది. హర్మూజ్ మార్గాన్ని మూసివేయడం వల్ల సరుకు రవాణా కూడా పెరుగుతుంది. ముడి చమురును మోసుకెళ్లే ప్రతి నాల్గవ నౌక ఇక్కడి నుంచే వస్తుంది. ప్రపంచంలోని రోజువారీ చమురు సరఫరాలో 30శాతం ఇక్కడి నుంచే వస్తుంది.