ముంబై, డిసెంబర్ 18: రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న విలువ బుధవారం చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, వడ్డీరేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకునే నిర్ణయం కోసం ట్రేడర్లు వేచి చూసే దోరణిలో ఉండటంతో కరెన్సీ మరింత పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పతనం చెంది చారిత్రక కనిష్ఠ స్థాయి 84.94కు జారుకున్నది.
దిగుమతిదారులు, విదేశీ బ్యాంకుల నుంచి డాలర్‌కు అనూహ్యంగా మద్దతు లభించడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా తమ నిధులను తరలించుకుపోవడం మార్కెట్లో మదుపరుల సెంటిమెంట్‌ను నిరాశపరిచింది. 84.92 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 84.95 కనిష్ఠ స్థాయికి జారుకున్నది. చివరకు మూడు పైసలు నష్టపోయి 84.94 వద్ద ముగిసింది. మంగళవారం కూడా కరెన్సీ 84.91కి పడిపోయిన విషయం తెలిసిందే. దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రెండో త్రైమాసికంలో భారత వృద్ధిరేటు మందగించడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని మిరాయ్ అసెట్ షేర్‌ఖాన్ రీసర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరీ తెలిపారు.
డాలర్ మరింత బలోపేతంకావడం, ఎఫ్ఐఐలు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం కూడా పతనానికి ఆజ్యంపోసిందన్నారు. అమెరికా కరెంట్ ఖాతా లోటు, గృహాల విక్రయాల డాటా విడుదలకానుండటం మదుపరులు వేచిచూసే దోరణి అవలంభిస్తున్నట్లు చెప్పారు. ఇలాగే కొనసాగితే త్వరలో రూపాయి 85.20 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. రూపాయి భారీగా పతనంకావడంతో దిగుమతులకోసం భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే దిగుమతులు కోసం అధికంగా నిధులు వెచ్చిస్తున్న కేంద్రానికి రూపాయి గుదిబండగా మారింది.