Rahul Bajaj | వెటరన్ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు. బజాజ్ ఆటోకు మారుపేరుగా నిలిచిన రాహుల్ బజాజ్ వయస్సు 82 ఏండ్లు. కుటుంబ సభ్యుల సాన్నిహిత్యంలోనే రాహుల్ బజాజ్ మరణించారని బజాజ్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. కొద్దికాలంగా న్యూమోనియా, గుండె సంబంధ ఆరోగ్య సమస్యలతో రాహుల్ బజాజ్ బాధ పడుతున్నారు. పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల యావత్ భారత్ కార్పొరేట్ రంగం సంతాపం వ్యక్తం చేసింది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
రాహుల్ బజాజ్ గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్‌గా, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. గతేడాది మే ఒకటో తేదీ నుంచి ఐదేండ్ల కాలానికి గ్రూప్ గౌరవ చైర్మన్‌గా నియమితులయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా బజాజ్ ఆటో గ్రూప్‌కు సారధ్యం వహించారు. వయోభారం వల్లే రాహుల్ బజాజ్ వైదొలిగారు. ఆయన అనుభవం, విజన్ నుంచి లబ్ధి పొందాలన్న లక్ష్యంగా బజాజ్ గ్రూప్ సంస్థ చైర్మన్ ఎమిరస్ ఐదేండ్ల పాటు నియమించాలని కంపెనీ నామినేషన్ అండ్ రెన్యూమనరేషన్ కమిటీ సిఫారసు చేసిందని బజాజ్ గ్రూప్ గతేడాది ఓ ప్రకటనలో తెలిపింది.
భారత కార్పొరేట్ యాడ్ ఇండస్ట్రీలో బజాజ్ గ్రూప్ కంపెనీలకు ఎంతో పేరుంది. యూ జస్ట్ కెనాట్ బీట్ ఏ బజాజ్, ఐకానిక్ టూ వీలర్ బజాజ్ స్కూటర్‌పై హమారా బజాజ్ ట్యాగ్‌లైన్లకు పాపులారిటీ వచ్చింది. గత ఐదు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో రాహుల్ బజాజ్ భాగస్వామ్యం చాలా పెద్దది.
బజాజ్ గ్రూప్ బాధ్యతలను 1965లో రాహుల్ బజాజ్ చేపట్టారు. నాటినుంచి గ్రూప్ టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు పెరిగింది. దేశీయంగా స్కూటర్ల విక్రయంలో బజాజ్ అగ్రస్థానంలో నిలిచింది. 2005లో తన తనయుడు రాజీవ్ బజాజ్‌కు రాహుల్ బజాజ్… గ్రూప్ బాధ్యతలు అప్పగించారు. రాజీవ్ బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు, వివిధ రకాల ఉత్పత్తులకు గ్రూప్ సేవలను విస్తరించారు.
రాహుల్ బజాజ్ మరణం పట్ల భారత రాజకీయ, కార్పొరేట్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా స్పందిస్తూ.. జాతి నిర్మాతల్లో ఒకరు, భారతమాత గొప్ప పుత్రుల్లో ఒకరని అభివర్ణించారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ స్పందిస్తూ.. సాహసోపేత, నిర్భయ నిర్ణయాలకు మారుపేరన్నారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా తదితరులు సంతాపం తెలిపారు. రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక సీఎంలు అశోక్ గెహ్లాట్, ఎంకే స్టాలిన్, బసవరాజ్ బొమ్మై కూడా రాహుల్ బజాజ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.