Hyderabad | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ క్రేజ్ అలా.. ఇలా పెరగడం లేదు. అటు రెసిడెన్షియల్ మార్కెట్లో.. ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే దూసుకుపోతున్నది. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బెంగళూరును మించి హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ కనిపించినట్టు ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ వెస్టియన్ తమ తాజా నివేదికలో స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 20: సుస్థిర ప్రభుత్వం.. సుపరిపాలన.. అభివృద్ధిదాయక నిర్ణయాలు.. అన్ని రంగాలకు ప్రోత్సాహకాలు.. ఇవీ.. తెలంగాణలో చూస్తే కనిపించేవి, వింటే వినిపించేవి. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు.. అన్ని రంగాల్లో సాధిస్తున్న ప్రగతే నిదర్శనం. రియల్ ఎస్టేట్ దూకుడుకూ ఇదే కారణం. ముఖ్యంగా ఓ ఇంటికైనా.. ఆఫీసుకైనా.. హైదరాబాదే ఇప్పుడు అందరి ఎంపికగా నిలుస్తున్నది. ప్రధానంగా ఇక్కడి ఆఫీస్ మార్కెట్‌కు గొప్ప క్రేజ్ ఉందని రోజుకో దేశ, విదేశీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు చెప్తూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ వెస్టియన్ సైతం తమ నివేదికలో ఇదే వెల్లడించింది. హైదరాబాద్‌సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ లీజింగ్‌పై సోమవారం ఓ రిపోర్టును విడుదల చేసింది. లీజింగ్ 21 శాతం, కొత్త సైప్లె 26 శాతం పెరిగినట్టు తేలింది.
బెంగళూరును అధిగమించి..
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో దేశంలోనే గొప్ప పేరున్న బెంగళూరును హైదరాబాద్ దాటేసింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో బెంగళూరు ఆఫీస్ స్పేస్ లీజులు 36 లక్షల చదరపు అడుగులకే పరిమితమయ్యాయి. నిరుడు జూలై-సెప్టెంబర్ (క్యూ3)లో గ్రాస్ లీజింగ్ 50 లక్షల చదరపు అడుగులుగా ఉండటం గమనార్హం. దీంతో ఈసారి లీజింగ్ 28 శాతం తగ్గుముఖం పట్టిందని వెస్టియన్ సోమవారం తెలియజేసింది. అంతేగాక మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఆఫీస్ స్పేస్ సైతం 25 శాతం పడిపోయి 27 లక్షల చదరపు అడుగుల వద్దే ఉన్నది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఈసారి 37 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్, 55 లక్షల్లో కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రావడం గమనార్హం. నిరుడు క్యూ3తో పోల్చితే లీజులు ఏకంగా 270 శాతం, కొత్త సైప్లె 175 శాతం ఎగబాకడం విశేషం.
➢ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్ తీరుతెన్నులపై వెస్టియన్ సర్వే.
➢ హైదరాబాద్‌సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతం వృద్ధితో 1.59 కోట్ల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్.
➢ ఈ ఏడు నగరాల్లో నిరుడు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే 26 శాతం పెరిగి కొత్తగా అందుబాటులోకి వచ్చిన 1.34 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్.
➢ ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లోనే ఎక్కువగా ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ. మొత్తం మార్కెట్లో 25 శాతం వాటా దీనిదే. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీల వాటా 20 శాతం.
➢ ఆఫీస్ స్పేస్ లీజుల్లో తయారీ, ఇంజినీరింగ్ రంగాల వాటా 17 శాతం. ఫ్లెక్సిబుల్ స్పేస్ కంపెనీల వాటా 16 శాతంగా ఉన్నది.
ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో లీజింగ్ కార్యకలాపాలు, కొత్త సైప్లెలు ఆకర్షణీయంగా నమోదయ్యాయి. కరోనా దగ్గర్నుంచి గమనిస్తే గరిష్ఠ స్థాయికి పెరిగాయి. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ దిశగా వెళ్తుండటం కలిసొస్తున్నది. మున్ముందు దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
-శ్రీనివాస రావు, వెస్టియన్ సీఈవో