IndiGo | ప్రముఖ దేశీయ ఎయిర్‌లైన్ కంపెనీ ఇండిగో సంస్థకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ.117.52 కోట్ల జరిమానా విధించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయనున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. కేరళలోని కొచ్చి సీజీఎస్టీ కమిషనరేట్ సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ద్వారా ఎయిర్‌లైన్స్‌కు జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ కంపెనీ ఈ మేరకు మంగళవారం కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. 2018-19, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ క్లెయిమ్ చేసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని జీఎస్టీ అధికారులు తిరస్కరించారు.
ఈ క్రమంలో రూ.117.52కోట్ల జరిమానాతో పాటు డిమాండ్ ఆర్డర్ జారీ చేసినట్లు ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫైలింగ్‌లో పేర్కొంది. అధికారులు జారీ చేసిన ఆర్డర్ తప్పని కంపెనీ పేర్కొంది. అధికారుల ఆదేశాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని.. న్యాయపరంగా వాటిని ఎదుర్కొంటామని చెప్పింది. ఈ కేసులో తామే గెలిచే అవకాశాలున్నాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ట్యాక్స్ నిపుణుల సలహా మేరకు ఆదేశాలను ఫోరంలో సవాల్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. జరిమానా ప్రభావం కంపెనీ ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, కంపెనీ షేర్లు 1.60శాతం తగ్గి ఒక్కో షేరు రూ.5,697.70 వద్ద ముగిసింది.