ముంబై, సెప్టెంబర్ 1: విదేశీ మారకం నిల్వలు మరిన్ని కరిగిపోయాయి. ఆగస్టు 25తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 30 మిలియన్ డాలర్లు తరిగిపోయి 594.858 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 7.273 బిలియన్ డాలర్లు కరిగిపోయిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీరూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడం వల్లనే ఫారెక్స్ రిజర్వులు తగ్గడానికి ప్రధాన కారణమని తెలిపింది.
గత వారంలో వీటి విలువ 538 మిలియన్ డాలర్లు తగ్గి 527.249 బిలియన్ డాలర్లకు తగ్గాయని తన వారాంతపు సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. డాలరేతర కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం ఇతర కరెన్సీలపై ప్రతికూల ప్రభావం చూపాయని వెల్లడించింది. గత వారంలో పసిడి రిజర్వులు 530 మిలియన్ డాలర్లు పెరిగి 44.354 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.