Serum Unit @ Africa | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ.. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) విస్తరణ బాట పట్టింది. ఆఫ్రికాలో తొలి మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. కొవిడ్ వ్యాక్సిన్ల విక్రయంలో విజయం సాధించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు విస్తరించాలని యోచిస్తున్నట్లు సీరం సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు.
రెండేండ్లకు పైగా ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అవసరమైన వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం లేని ఖండం ఆఫ్రికా. దీంతో సీరం ఇన్స్టిట్యూట్తో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆఫ్రికా ఖండ దేశాలు ఆధారపడి ఉన్నాయి
ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పాదక యూనిట్లు విస్తరించాలని భావిస్తున్నట్లు అదార్ పూనావాలా చెప్పారు. ఒక వ్యాక్సిన్ తయారీదారుకు ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి ఉండదన్నారు. సౌతాఫ్రికా, ర్వాండా వంటి దేశాల్లో ఒకచోట ఉత్పాదక యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విషయమై దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు వద్ద ఆఫిక్రా దేశాల అధికారులతో అదార్ పూనావాలా చర్చలు జరిపారు.