Akasa Air | ఇండియన్ న్యూ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులను జూన్‌లో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. విమాన సర్వీసుల నిర్వహణకు అవసరమైన లైసెన్సుల కోసం కృషి చేస్తున్నట్లు సంస్థ సీఈవో వినయ్ దూబే శుక్రవారం చెప్పారు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరొందిన బిలియనీర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆధ్వర్యంలో ఆకాశ ఎయిర్.. విమానాలు నడిపేందుకు ముందుకు వస్తున్నది. ఇండిగో, జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవోలతో కలిసి దేశీయ విమాన రంగంలో పని చేసేందుకు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దీర్ఘ కాలిక ప్రణాళికతో వస్తున్నారు.
విమాన సర్వీసులు ప్రారంభించిన 12 నెలల్లో 18 విమానాలతో సేవలందించాలని ఆకాశ ఎయిర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేండ్లలో 72 సొంత విమానాలు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈవో వినయ్ దూబే తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఎయిర్‌షో వద్ద వినయ్ దూబే మీడియాతో ఈ సంగతి చెప్పారు.
దేశీయంగా మాత్రమే ఆకాశ్ ఎయిర్ విమాన యాన సేవలు అందిస్తుంది. కానీ ఏయే నగరాల మధ్య తమ సంస్థ విమాన సర్వీసులు పని చేస్తాయన్న సంగతి మాత్రం దూబే చెప్పలేదు. ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో పోటీ పడతామని ఆకాశ ఎయిర్ గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డర్లు పెట్టింది. వీటి విలువ 900 కోట్ల డాలర్లు. గతేడాది అక్టోబర్‌లో ఆకాశ్ ఎయిర్‌కు కేంద్ర పౌర విమానయానశాఖ నుంచి క్లియరెన్స్ లభించింది.