Smart Phones | ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్.. చిల్లరకొట్టు వ్యాపారి.. కార్పొరేట్ దిగ్గజం.. సాధారణ పౌరులు.. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే రైతులు.. సాధారణ గృహిణులు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. రోజురోజుకు స్మార్ట్ ఫోన్ వాడకం దారుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రత్యేకించి 2026 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 100 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటారని డెల్లాయిట్ అనే సంస్థ తెలిపింది. గతేడాది చివరికల్లా 120 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వారిలో 75 కోట్ల మంది వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వచ్చే ఐదేండ్లలో స్మార్ట్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో నిలువనున్నది.
2021 నుంచి 2026 వరకు వార్షిక ప్రాతిపదికన పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం 2.5 శాతం నుంచి ఆరు శాతానికి పెరుగుతుందని డెల్లాయింట్ 2022 గ్లోబల్ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా, ఎంటర్టైన్మెంట్, టెలికం) అంచనా నివేదిక తెలిపింది. అధిక ఇంటర్నెట్ వినియోగం స్మార్ట్ఫోన్ల డిమాండ్‌కు ఛోదక శక్తి కానున్నదని పేర్కొంది. తద్వారా ఫిన్‌టెక్, ఈ-హెల్త్, ఈ-లెర్నింగ్ సేవల డిమాండ్ పెరుగుతుందని డెల్లాయిట్ వివరించింది.
కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి భారత్‌నెట్ ప్రోగ్రాం కింద అన్ని గ్రామాలను ఫైబర్‌నెట్ పరిధిలోకి తేవాలని ప్రణాళికలు రూపొందించింది. పట్టణ మార్కెట్లో 2026లో 95 శాతం మంది న్యూ స్మార్ట్ ఫోన్లను రీప్లేస్ చేసుకోనున్నారు. గ్రామాల్లో 80 శాతం మంది కొత్త స్మార్ట్ ఫోన్లకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించింది.
ఇక పట్టణ ప్రాంతాల్లో 7.2 కోట్ల ఫీచర్ ఫోన్లు ఆరు కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 7.1 కోట్ల నుంచి ఆరు కోట్లకు దిగి వస్తాయని తెఇలపింది. 2021లో 30 కోట్ల మంది వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటే, 2026 నాటికి 40 కోట్లకు వృద్ధి చెందుతుందని తెలిపింది. 5జీ స్పెక్ట్రం ఆవిష్కరించిన తర్వాత స్మార్ట్ ఫోన్ల వాడకానికి డిమాండ్ పెరుగుతుందని డెల్లాయిట్ వివరించింది.
2022 నుంచి ఏడాదికేడాది 5జీస్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరుగనున్నాయి. ప్రస్తుతం 3జీ స్పెక్ట్రం మొబైల్ నెట్వర్క్ నుంచి కస్టమర్ల పరివర్తనకు తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లను మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు అందుబాటులోకి తేనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సెమీ కండక్టర్ల చిప్‌ల కొరత 2023లో క్రమంగా తగ్గుతుందని డెల్లాయిట్ తెలిపింది.