ముంబై, జనవరి 5: విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. డిసెంబర్ 29తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 4.471 బిలియన్ డాలర్లు మేర పెరిగిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పెరగడం వల్లనే రిజర్వులు అధికమయ్యాయని తెలిపింది. గత వారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.869 బిలియన్ డాలర్లు అధికమై 551.615 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే బంగారం రిజర్వులు 853 మిలియన్ డాలర్లు ఎగబాకి 48.328 బిలియన్ డాలర్లకు చేరాయి.