IT Returns | మీకు రూ.10 లక్షల వేతనం వస్తుందా.. ఇవీ పన్ను బెనిఫిట్ మార్గాలు?!
IT Returns | మీరు ఏటా రూ.10 లక్షల ఆదాయం పొందుతున్నారా.. అయితే పాత పన్ను విధానంలో దాదాపు రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయొచ్చు.
IT Returns | వేతన జీవులు, చిన్న వ్యాపారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), కార్పొరేట్ సంస్థలు ప్రతియేటా ఐటీ రిటర్న్స్ సమర్పిస్తుంటారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ సమర్పించడానికి వచ్చే నెలాఖరుతో గడువు ముగుస్తుంది. వేతన జీవులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు పన్ను ఆదా కోసం పెట్టుబడులు, పొదుపు స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వచ్చే నెలాఖరుతో గడువు ముగియనున్నది. దీనికి తోడు పాత ఆదాయం పన్ను (Old Tax Regime), కొత్త ఆదాయం పన్ను పాలసీ (New Tax Regime) లు అమల్లో ఉన్నాయి.
పాత, కొత్త పన్ను పాలసీల్లో వేతన జీవులు తమకు ఇష్టమైన పాలసీని ఎంచుకోవచ్చు. కొత్త పన్ను పాలసీ (New Tax Regime)లో కొన్ని పన్ను మినహాయింపులు ఉన్నా, పాత ఆదాయం పన్ను పాలసీలోనే ఎక్కువ మినహాయింపులు, రాయితీలు క్లయిమ్ చేయొచ్చు. ఆదాయం, పన్ను ఆదా పథకాల్లో పొదుపు చేయడాన్ని బట్టి అసలు ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం రాక పోవచ్చు. ప్రతి పన్ను చెల్లింపుదారుడు రూ.2.5 లక్షల వరకు పన్ను పే చేయనక్కర్లేదు. అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ కింద మరో రూ.50 వేల వరకు పన్ను చెల్లించనవసరం లేదు.
ఇక పాత ఆదాయం పన్ను విధానంలో ఆదాయం పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 70 రకాల డిడక్షన్లు క్లయిమ్ చేయొచ్చు. వాటిలో 80సీ, 80డీ సెక్షన్లు మినహా మిగతా సెక్షన్ల గురించి అవగాహన తక్కువ. ఆయా సెక్షన్లలో దాదాపు రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. కనుక ఆదాయం పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పాత ఆదాయం పన్ను పాలసీ కింద అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులపై ఓ లుక్కేద్దామా..!
80సీ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు రాయితీ
ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ (Section 80C) కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. వేతన జీవులందరికీ ఈ సెక్షన్ పాపులర్. ఈ సెక్షన్ కింద పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్), జీవిత బీమా పాలసీ ప్రీమియం, పోస్టాఫీసుల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఐదేండ్ల పన్ను ఆదా సేవింగ్ డిపాజిట్లు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్, పిల్లల ట్యూషన్ ఫీజు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), ఇంటి రుణంపై అసలు చెల్లింపు, సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెడితే పన్ను ఆదా అవుతుంది.
ఎల్ఐసీ యాన్యూటీ లేదా పెన్షన్ ఫండ్ కింద రూ.1.50 లక్షలు
ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీసీ (Section 80CCC) సెక్షన్ కింద భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో యాన్యుటీ ప్లాన్ లేదా ఫండ్ నుంచి పెన్షన్, ఇతర జీవిత బీమా సంస్థల్లో పొదుపు చేసే సొమ్ముకు పన్ను రాయితీ పొందొచ్చు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు క్లయిమ్ చేయొచ్చు. ఇక నేషనల్ పెన్షన్ పథకం వంటి స్కీమ్‌ల్లో పథకాల్లో పొదుపు మొత్తాలపై సెక్షన్ 80సీసీడీ (Section 80CCD) కింద పన్ను రాయితీ పొందొచ్చు.
ఆరోగ్య బీమా కింద రూ.25 వేలకు క్లయిమ్ చేయొచ్చు
కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారు సెక్షన్ 80డీ (Section 80D) కింద రూ.25 వేల ప్రీమియం వరకు టాక్స్ డిడక్షన్ క్లయిమ్ దాఖలు చేయొచ్చు. సీనియర్ సిటిజన్లకు రూ.30 వేల వరకు లిమిట్ కల్పించారు. ఏ పాలసీ లేని 80 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లు తమ వైద్య ఖర్చుల కోసం రూ.30 వేలు ఖర్చు చేస్తే పన్ను మినహాయింపు లభిస్తుంది.
దివ్యాంగుల వైద్య చికిత్సకు రూ.1.25 లక్షల వరకూ..
ప్రతి ఒక్క వేతన జీవి తమపై ఆధారపడి ఉన్న దివ్యాంగుల వైద్య చికిత్స ఖర్చుల కోసం సెక్షన్ 80డీడీ (Section 80DD) కింద రూ.75 వేలు పన్ను డిడక్షన్ క్లయిమ్ దాఖలు చేయొచ్చు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటే రూ.1.25 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
వైద్య చికిత్సకు రూ.80 వేల వరకు రాయితీ
60 ఏండ్ల లోపు వ్యక్తులు ఏదైనా తీవ్ర అనారోగ్యానికి చికిత్స కోసం సెక్షన్ 80డీడీబీ (Section 80DDB) కింద రూ.40 వేల వరకు క్లయిమ్ ఫైల్ చేయొచ్చు. తమపై ఆధారపడ్డ వారి చికిత్సకూ ఈ క్లయిమ్ అమలవుతుంది. సీనియర్ సిటిజన్లు రూ.60 వేల వరకు, 80 ఏండ్లు దాటిన వారు రూ.80 వేల వరకు పన్ను రాయితీ పొందొచ్చు.
పిల్లల ఉన్నత విద్యారుణంపై వడ్డీకి పూర్తి పన్ను రాయితీ
ప్రతి వ్యక్తి తమ పిల్లల ఉన్నత విద్యా రుణంపై వడ్డీ చెల్లిస్తున్నట్లయితే సెక్షన్ 80ఈ (Section 80E) కింద పన్ను రాయితీ పొందొచ్చు. విద్యా రుణం అసలు చెల్లిస్తే పన్ను రాయితీ వర్తించదు.
ఇంటి రుణంపై గరిష్టంగా రూ.2 లక్షలు రాయితీ
బ్యాంకు లోన్ సాయంతో ఇల్లు కొనుగోలు చేసిన వేతన జీవి.. తన రుణం వడ్డీ చెల్లింపుపై ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 24 (Section 24) కింద గరిష్టంగా రూ.2 లక్షలు పన్ను రాయితీ క్లయిమ్ చేయవచ్చు. సొంతిల్లు లేని వారు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందని వేతన జీవులు సెక్షన్ 80జీజీ (Section 80GG) కింద గరిష్టంగా రూ.60 వేల వరకు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు.
విరాళాలు, ఇతర పెట్టుబడులపై మినహాయింపులు ఇలా
ప్రతి వ్యక్తి తన ఆదాయంలో స్వచ్ఛంద సంస్థలకు, ఇతర సహాయ నిధులకు ఇచ్చే విరాళాలకు సెక్షన్ 80జీ (Section 80G) కింద పన్ను డిడక్షన్ క్లయిమ్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు సెక్షన్ 80టీటీఏ (Section 80TTA) కింద రూ.10 వేల వరకు మినహాయింపు క్లయిమ్ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంది. బ్యాంకులు, కో-ఆపరేటివ్ సొసైటీలు, పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి ఈ సెక్షన్ కింద పన్ను రాయితీ క్లయిమ్ చేయవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

