Elon Musk | టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తిరిగి ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. బ్లూంబర్గ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 210.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలన్ మస్క్ మొదటి స్థానంలోకి వచ్చేశారు. ఇప్పటి వరకూ తొలి స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 206.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి, 200.4 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ అర్నాల్డ్ మూడో స్థానానికి చేరుకున్నారు. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్డ్ మధ్య గత నెల 29 నుంచి పోటీ కొనసాగుతున్నది.
తాజాగా టెస్లా షేర్లు పుంజుకోవడంతో ఎలన్ మస్క్.. ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఇటీవలి టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో సంస్థ సీఈఓగా ఎలన్ మస్క్‌కు 58 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం లభించింది. దీనికి తోడు తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ ఎక్స్ఏఐలో 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. కంపెనీలో ఎలన్ మస్క్ 65 శాతం వాటా కలిగి ఉన్నారు. దీంతో టెస్లా షేర్లు లాభాలు గడించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆశ్చర్యకర రీతిలో ఎన్నికలు ప్రకటించడంతో ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ వ్యక్తిగత సంపద దాదాపు 13 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది.