Rental Homes | నగరాలు, పట్నాల్లో అద్దె ఇండ్లలో జీవించేవారు భారీ సంఖ్యలోనే ఉంటారు. పట్నాలకు వలస వచ్చేవారిలో ఎక్కువ మంది అద్దె ఇంట్లోనే జీవనం సాగించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ పిరంగా మారాయి. దీంతో ఇప్పుడు సామాన్యులకు ఇండ్ల ధరలు అందుబాటులో లేవు. దీంతో మధ్య తరగతి వర్గ ప్రజలు అద్దె ఇండ్లను ఆశ్రయించక తప్పడం లేదను. కానీ వారి నెలవారీ ఆదాయంలో గణనీయ భాగం ఇంటి అద్దెకే కేటాయించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటి అద్దె భారం తగ్గించుకోవడం ఎలాగో చూద్దామా.. !
నగరంలోని ప్రధాన రహదారికి దగ్గర్లోనే అద్దె ఇల్లు కావాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనుక ప్రధాన రోడ్డుకి ఇరువైపులా 500 మీటర్లు, కిలోమీటర్ అంతకంటే కొంచెం దూరంలో అద్దె ఇల్లు తీసుకుంటే తక్కువ ఇంటి అద్దె ఉంటుంది.
ఇప్పుడు నగరంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి అన్ని రకాల వసతులు వస్తున్నాయి. ప్రత్యేకించి నిత్యావసర వస్తువుల మార్కెట్లు, స్కూళ్లు, వెహికల్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్ తదితర వసతులు లోలోపలి ప్రాంతాల్లోకి వచ్చేశాయి. కనుక కాలనీలు, బస్తీల లోపల ఇల్లు అద్దెకు తీసుకోవడం బెస్ట్.
పట్నాలు, నగరాల్లో అపార్ట్ మెంట్ల కల్చర్ చాలా ఎక్కువ. ఇటువంటి ఇండ్లు, అపార్ట్ మెంట్ ప్లాట్లలో అద్దెలు ఎక్కువే. అద్దెకు తోడు మెయింటెనెన్స్ చార్జీలు.. నీటి చార్జీలు చెల్లించాలి. నెలవారీ వేతనంపై బతికే మధ్య తరగతి కుటుంబాలకు ఇది అదనపు భారమేనని చెబుతున్నారు. ఇటువంటి ఇండ్లలో ఉండటానికి బదులు కాసింత దూరమైనా ఇండిపెండెంట్ ఇంటిలో అద్దెకు దిగడం చాలా మంచిది. నిర్వహణ చార్జీల భారం ఉండదు. ఒకవేళ మెయింటెనెన్స్ చార్జీలు ఉన్నా తక్కువగానే ఉంటయి.
కుటుంబ యజమానితో సత్సంబంధాలు కొనసాగిస్తుండాలి. అలా చేసేవారు సక్రమంగా ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లయితే .. ఓనర్ అద్దె తగ్గించే అవకాశం ఉంటది. ఇంటి అద్దె పెంచినప్పుడు.. మీ పట్ల ఉండే క్రెడిబిలిటీ వల్ల పెద్దగా పెంచక పోవచ్చు.
ఇంతకుముందు ఇంటి అద్దె క్యాష్ రూపంలో చెల్లించేవారు. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్సే కనుక యాప్లు, క్రెడిట్ కార్డులతో ఆన్ లైన్ లో పే చేసేయొచ్చు. ఇలా చేయడం వల్ల క్యాష్ బ్యాక్, ఇతర ఆన్ లైన్ పేమెంట్స్ ఆఫర్లతో నెలవారీ చెల్లించే అద్దెలో కొంత మొత్తం పొదుపు చేయొచ్చు.
హౌస్ రెంట్ పేమెంట్స్ ఆటోమేటిక్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. యూపీఐ పేమెంట్ సిస్టమ్ ద్వారా రెంట్ పే చేయొచ్చు. మీరు ఉండే ఇంటిలో మరొకరికి వసతి కల్పించినా అద్దెలో కొంత పొదుపు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బంధువుల పిల్లలను పేయింగ్ గెస్ట్ గా తీసుకొచ్చుకోవచ్చు. మీరు సింగిల్ గా ఉంటే నమ్మకమైన వ్యక్తులతో అద్దె ఇంటిలో కలిసి ఉండొచ్చు.
ఏదైనా ఇంటిలో అద్దెకు దిగినప్పుడు వాటర్ పైపులు, స్విచ్ బోర్డులు, ఏసీ, వాషింగ్ మిషన్ కనెక్షన్ చేయించుకుంటారు. తరచుగా ఇండ్లు మారే వారికి ఇవి అదనపు ఖర్చుగా మారతాయి. అసలే సామాన్ల రవాణా ఖర్చు ఉంటది. ఇప్పుడు మీరు చెల్లించే ఇంటి అద్దెతో సమానంగా మరో ప్రదేశంలో అద్దె ఇల్లు దొరక్కపోవచ్చు. ఇంటి ఓనర్ అద్దె అడ్వాన్స్ ఎక్కువ కాలానికి తీసుకోవచ్చు. ఇటువంటివన్నీ సామాన్యులకు ఆర్థికంగా ప్రతిబంధకాలుగానే ఉంటాయి. కనుక అనివార్యమైన, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మరో ఇంటికి మారే ఆలోచన చేయడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.