బుధవారం 03 జూన్ 2020
Business - Apr 06, 2020 , 23:11:02

హైదరాబాద్‌ స్టార్టప్‌ల నయా ట్రెండ్‌

హైదరాబాద్‌ స్టార్టప్‌ల నయా ట్రెండ్‌

  • లాక్‌డౌన్‌ వేళ సరికొత్త ఆలోచనలతో సేవలు 
  • మనుగడ కోసం పరస్పర సహకారంతో ముందుకు
  • నగదు నిల్వలను కాపాడుకుంటూనే విస్తరణ దిశగా పయనం

బన్ను, బిన్ను ఐఐటీ విద్యార్థులు. కొత్త ఆలోచనలతో.. నిత్యనూతన ఆవిష్కరణల కోసం ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు. కానీ అంతా బాగుంది అనుకునేలోగానే కరోనా వైరస్‌ వారి ఆశలను ఆవిరి చేసింది. తమ ఆశయాలు, లక్ష్యాలు ఒక్కసారిగా కుప్పకూలాయా? అన్న ఆందోళన వారిలో కనిపించింది. అయితే ఈ విపత్కర పరిస్థితిని ఓ సవాల్‌గా స్వీకరించారు. మెదడుకు పదునుపెట్టి వినూత్నరీతిలో వెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్‌లోని చాలా స్టార్టప్‌లు ఇలాగే తమ ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకుంటున్నాయిప్పుడు. లాక్‌డౌన్‌ వేళ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టి తమ మనుగడకు ఢోకా లేదని చాటుతున్నాయి. 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6: కరోనా వైరస్‌ కట్టడి కోసం అమలవుతున్న లాక్‌డౌన్‌తో వ్యాపారాలన్నీ మూతబడితే.. హైదరాబాద్‌ స్టార్టప్‌లు మాత్రం ధైర్యం కోల్పోకుండా దీన్నో అవకాశంగా మలుచుకుని రాణిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో కొత్తగా ఆలోచించి తమకెదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల్ని జయించాలని చూస్తున్నాయి. వచ్చే ఆరు నెలలు గడ్డు కాలమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. వృద్ధికి ఊతమిచ్చే ఆలోచనలతో ముందుకెళ్తున్నామన్న విశ్వాసాన్ని చాలా స్టార్టప్‌లు కనబరుస్తుండటం గమనార్హం.  డిజిటల్‌, టెక్నాలజీ, ఉత్పాదక, శ్రామిక ఏ రకమైన స్టార్టప్‌లైనా పరస్పరం వనరులను ఇచ్చిపుచ్చుకుంటూ మనుగడను సాగిస్తుండటం విశేషం. తమ ఉద్యోగులను ఇతర స్టార్టప్‌ల అవసరాలకు వినియోగిస్తూ అటు వారినీ, ఇటు తమనూ కొన్ని స్టార్టప్‌లు పదిలంగా ఉంచుకుంటున్నాయి. గతంలో కియోస్క్‌ల ద్వారా కస్టమర్లకు సేవలు అందించిన సంస్థలు ఇప్పుడు డోర్‌ డెలివరీని చేపట్టాయి. నిత్యావసరాలతోపాటు ఔషధాలనూ ఇంటికే చేరుస్తున్నాయి. ఇందుకోసం ఇతర రకాల స్టార్టప్‌ల సాయంతో ముందుకెళ్తున్నాయి. ఉదాహరణకు హోటల్‌ ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌లు.. కిరాణా సరుకులను, కూరగాయలను, మందులనూ కస్టమర్లకు సరఫరా చేస్తున్నాయి. 

మమ్మల్ని ఆదుకోండి

దేశీయ స్టార్టప్‌లను కరోనా వైరస్‌ షేక్‌ చేస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు నిర్వాహకులు లేఖలు రాస్తుండగా, సాయం అందకపోతే మూతబడటం ఖాయమన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ రిఫండ్లు, ఐటీ కోతలు, వడ్డీ లేని రుణాలను కోరుతున్నారు. ‘ప్రతీ స్టార్టప్‌ తమ నగదు నిల్వలను కాపాడుకోవాలి. ఇదే సమయంలో మనుగడనూ చాటుకోవాలి. అందుకోసం స్వచ్ఛందంగా జీతాలను తగ్గించుకోవాలని ఉద్యోగులను కోరాలి. వ్యాపార అవకాశాలనూ ఇతర సంస్థలతో పంచుకోవాలి’

-అభిషేక్‌ దేశ్‌పాండే, రెసికల్‌ వ్యవస్థాపకుడు


logo