సీఎం కేసీఆర్ కృషి ఫలిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు.. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు నిలబెడుతున్నాయి.
ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో సత్తా చాటుతున్న హైదరాబాద్‌లో ఇప్పుడు ఏరోప్లేన్ కన్వర్షన్ లైన్ కూడా వస్తున్నది. జీఎమ్మార్, బోయింగ్ మధ్య త్వరలోనే ఒప్పందం జరుగనున్నది.
ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్చనున్నారు. ఈ తరహా కార్యకలాపాలకు
దిగుతున్న ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్ దేశంలో బోయింగ్ సంస్థే.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): విమానయాన రంగంలో హైదరాబాద్ శరవేగంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే విమాన విడిభాగాలు, హెలికాప్టర్ బాడీ తయారీ వంటి వాటికి ప్రసిద్ధిగాంచిన మన నగరంలో.. త్వరలోనే సరికొత్త కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. జీఎమ్మార్ ఏరో టెక్నిక్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ప్రయాణికుల విమానాలను సరుకు రవాణా విమానాలుగా మార్చే కార్యకలాపాలను ప్రారంభించనున్నది. ఇందులో భాగంగా 737 బోయింగ్ ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్పిడి చేయనున్నారు. దీనికోసం కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు రేపోమాపో ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారత్‌లోని ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్) ఈ తరహా కార్యకలాపాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతుండగా.. సీఎం కేసీఆర్ కృషికి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలకు ఇది మరో నిదర్శనం. విమాన కంపెనీలు సహజంగా ప్యాసింజర్ విమానాలనే ఎక్కువగా తయారుచేస్తాయి. ఇవి ఎంతకాలం ఉపయోగపడతాయనేది వాటి నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ప్యాసింజర్ విమానం కనీసం 50వేల గంటలు ప్రయాణిస్తుంది. ఇటీవల తయారవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగల విమానాలు ఇంతకన్నా ఎక్కువ ఉపయోగపడుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. విమాన విడిభాగాలు ఖరీదైనవి కాబట్టి కాలపరిమితి పూర్తయిన విమానాల విడిభాగాలను ఇతర విమానాలకూ ఉపయోగిస్తారు.
హైదరాబాద్‌లో ఈ తరహా కార్యకలాపాలు చేపట్టడం భారత్‌లోని ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్) సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. మొదటి విమాన మార్పిడి సమయం ఇండిగో, స్పైస్‌జెట్, బ్లూడార్ట్, క్విక్‌జెట్ తదితర కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్‌పై ఆధారపడి ఉంటుందని బోయింగ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ విమానాలకు ఉన్న గిరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటేటా విమాన ప్రయాణికుల్లో జరుగుతున్న వృద్ధి, కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విమాన సౌకర్య విస్తరణ తదితర చర్యలు అత్యంత జోరుగా సాగుతున్నాయి. విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత సందర్భంలో అదే స్థాయిలో పాత విమానాలను ఇతర అవసరాలకు వినియోగించాల్సిన ఆవశ్యకత కూడా పెరుగుతూ వస్తున్నది. దీంతో రానున్న రోజుల్లో కన్వర్షన్ కార్యకలాపాలకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ఏరోస్పేస్ రంగంలో దేశంలోనే ఎంతో ముందున్న తెలంగాణ రాష్ర్టానికి ఇది మరింత కలిసొచ్చే అంశమని వారు పేర్కొంటున్నారు.
టాటా-బోయింగ్ సంయుక్త భాగస్వామ్య సంస్థ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో ఇప్పటికే అత్యాధునిక విమాన విడిభాగాల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో విమానాలు, హెలికాప్టర్ల బాడీతోపాటు ఇతర పరికరాలను తయారుచేస్తున్నారు. తాజాగా బోయింగ్ సంస్థ జీఎమ్మార్ ఏరో టెక్నిక్స్ భాగస్వామ్యంలో కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం.. ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ దూకుడును చాటిచెప్తున్నది. కాగా, ఒప్పందంలో భాగంగా వచ్చే 18 నెలలపాటు శిక్షణతోపాటు సామర్థ్యాల వృద్ధి (ఎలా మార్పిడి చేయాలనే దానిపై)పై రెండు సంస్థలూ కలిసి పనిచేస్తాయి.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణాకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. నౌకలతో పోల్చుకుంటే రవాణా ఖర్చు ఎక్కువే అయినప్పటికీ అతితక్కువ సమయంలో సరుకును గమ్యస్థానాలకు చేరవేసే అవకాశం కార్గో విమానాలకే ఉంటుం ది. ఉదాహరణకు అమెజాన్ సంస్థ ఇటీవలే హైదరాబాద్‌లో సొంతంగా ఓ కార్గో విమానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలంచెల్లిన విమానాలను సరుకు రవాణా కోసం మార్పిడి చేయడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. ఇది చౌక ప్రత్యామ్నాయం కూడా. ఇందులో భాగం గా సీట్లను తొలగించడం, విండోలను మూసేయడం, లోడింగ్-అన్లోడింగ్ ఏర్పాట్లు, సరుకు పెట్టుకునేందుకు తగినంత చోటు ఉండేలా మార్పులు చేస్తారు.