హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌లు భారీగా నిధులు సమీకరిస్తున్నాయి. వ్యాపార విస్తరణకోసం ఇప్పటికే పలు సంస్థలు..దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించగా..తాజాగా ఇదే జాబితాలోకి మరో సంస్థ ‘లెమ్మే బీ’ చేరింది. ప్రీ-సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా రూ.13.5 కోట్ల నిధులను సేకరించినట్లు ప్రకటించింది.
వీటిని వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వామి క్యాపిటల్, సత్వ ఫ్యామ్లీ ఆఫీస్, అనికట్ క్యాపిటల్, గ్రిప్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి సమీకరించినట్లు కంపెనీ సీఈవో, ఫౌండర్ దేవిదత్త తెలిపారు. ఇలా సేకరించిన నిధులను నూతన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయంగా వ్యాపార విస్తరణలో భాగంగా దుబాయి, అమెరికా, ఆస్ట్రేలియాకు విస్తరించడానికి వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.