న్యూఢిల్లీ, మార్చి 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన పరిశ్రమ భారీ నష్టాల్ని చవిచూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. విమాన ఇంధన ధరలు పెరగడం, కొవిడ్ వేవ్స్‌తో సర్వీసులు నడపలేకపోవడం, ఛార్జీలకు పరిమితి విధించుకోవడం వంటి అంశాల కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ. 25,000-26,000 కోట్ల నికర నష్టాన్ని చవిచూడవచ్చని ఇక్రా గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అయితే విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నందున, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలు రూ. 14,000-16,000 కోట్లకు తగ్గవచ్చని అంచనాల్లో పేర్కొంది. 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 శాతం వరకూ పెరిగిందని, అయినా ఇది కొవిడ్ ముందస్తు స్థాయికంటే తక్కువేనన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రయాణీకుల ట్రాఫిక్ మరింత పెరుగుతుందని ఇక్రా అంచనా వేస్తూ 2024ఆర్థిక సంవత్సరానికల్లా కొవిడ్ ముందస్తు స్థాయికి చేరుకోవొచ్చన్నది.